Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివరి టీ20 వర్షం అంతరాయంతో అర్థాంతరంగా ఆగి, డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో టైగా ముగిసినా.. టీమ్ ఇండియాకే సిరీస్ చిక్కింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17), అర్షదీప్ సింగ్ (4/37) నాలుగు వికెట్ల ప్రదర్శనలతో న్యూజిలాండ్ తొలుత 160 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో భారత్ 9 ఓవర్లలో 75/4తో ఉండగా వర్షం ఆటను ముందుకు సాగనివ్వలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ 'టై'గా ముగిసింది. 1-0తో టీ20 సిరీస్ టీమ్ ఇండియా సొంతమైంది.
- చివరి టీ20కి వర్షం అంతరాయం
- డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ 'టై'
- 1-0తో టీ20 సిరీస్ భారత్ వశం
నవతెలంగాణ-నేపియర్ :
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ నిష్క్రమణ నుంచి భారత ఊరట చెందింది. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. కివీస్ పర్యటనలో వరుసగా రెండో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. నేపియర్ మూడో టీ20 వర్షం అంతరాయంతో అర్థాంతరంగా ఆగిపోగా.. మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చారు. డక్‌వర్త్ లూయిప్ ప్రకారం 9 ఓవర్లలో స్కోరు 75 ఉండాలి. భారత్ సరిగ్గా 75 పరుగులు చేయటంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఛేదనలో కెప్టెన్ హార్దిక్ పాండ్య (30 నాటౌట్, 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 160 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే (59, 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (54, 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించగా.. మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ నాలుగేసి వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. మహ్మద్ సిరాజ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, సూర్యకుమార్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
సిరాజ్, సింగ్ నిప్పులు : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ధనాధన్ ఆరంభం లభించింది. ఫిన్ అలెన్ (3) అవుటైనా.. కాన్వే (59), చాప్మన్ (12) దూకుడుగా ఆడారు. పవర్‌ప్లే చివరి ఓవర్లో చాప్‌మన్‌ను అవుట్ చేసిన సిరాజ్ కివీస్ దూకుడుకు కళ్లెం వేశాడు. కాన్వేతో జతకట్టిన ఫిలిప్స్ (54) భారీ భాగస్వామ్యంతో పాటు అర్థ సెంచరీలు నమోదు చేశారు. దీంతో చివరి ఓవర్లలో కివీస్ భారీగా పరుగులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. డెత్ ఓవర్లలో వికెట్ల మోత మోగించిన సిరాజ్, అర్షదీప్‌లు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే పరిమితం చేశారు.
పాండ్య ఫటాఫట్! : ఛేదనలో ఓపెనర్లు ఎదురుదాడి చేశారు. కానీ ఆ క్రమంలో వికెట్లు నిలుపుకోలేదు. కిషన్ (10), పంత్ (11)లతో పాటు సూర్యకుమార్ (13, 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. 21/3తో కష్టాల్లో పడిన భారత్‌ను కెప్టెన్ హార్దిక్ (30 నాటౌట్) ఆదుకున్నాడు. వికెట్లు పడినా రన్‌రేట్ తగ్గకపోవటం భారత్‌కు కలిసొచ్చింది. దీపక్ హుడా (9 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. 9 ఓవర్లలో 75/4తో ఉన్న సమయంలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో తేల్చారు. కివీస్ బౌలర్లలో సౌథీ (2/27) రాణించాడు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (ఎల్బీ) అర్షదీప్ 3, కాన్వే (సి) కిషన్ (బి) అర్షదీప్ 59, చాప్మన్ (సి) అర్షదీప్ (బి) సిరాజ్ 12, ఫిలిప్స్ (సి) భువనేశ్వర్ (బి) సిరాజ్ 54, మిచెల్ (సి) పంత్ (బి) అర్షదీప్ 10, నీషమ్ (సి) పంత్ (బి) సిరాజ్ 0, శాంట్నర్ (సి) చాహల్ (బి) సిరాజ్ 1, మిల్నె రనౌట్ 0, సోధి (బి) అర్షదీప్ 0, సౌథీ (బి) హర్షల్ 6, ఫెర్గుసన్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (19.4 ఓవర్లలో ఆలౌట్) 160.
వికెట్ల పతనం : 1-9, 2-44, 3-130, 4-146, 5-147, 6-149, 7-149, 8-149, 9-149, 10-160.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-35-0, అర్షదీప్ 4-0-37-4, సిరాజ్ 4-0-17-4, హుడా 1-0-3-0, చాహల్ 3-0-35-0, హర్షల్ 3.4-0-28-1.
భారత్ ఇన్నింగ్స్ : కిషన్ (సి) చాప్మన్ (బి) మిల్నె 10, పంత్ (సి) సోధి (బి) సౌథీ 11, సూర్య (సి) ఫిలిప్స్ (బి) సోధి 13, శ్రేయస్ (సి) నీషమ్ (బి) సౌథీ 0, పాండ్య నాటౌట్ 30, హుడా నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (9 ఓవర్లలో 4 వికెట్లకు) 75.
వికెట్ల పతనం : 1-13, 2-21, 3-21, 4-60.
బౌలింగ్ : సౌథీ 3-0-27-2, మిల్నె 2-0-23-1, ఫెర్గుసన్ 1-0-8-0, సోధి 2-0-12-1, శాంట్నర్ 1-0-5-0.