Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీపై 2-1తో సంచలన విజయం
దోహా (ఖతార్) : ఆసియా సింహనాదం ఫిఫా ప్రపంచకప్‌లో మరింత గట్టిగా వినిపిస్తోంది. ఫిఫా ప్రపంచకప్ మాజీ చాంపియన్ జర్మనీపై జపాన్ సంచలన విజయం నమోదు చేసింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో జర్మనీపై గెలుపు రుచి ఎరుగని జపాన్.. 2022 ప్రపంచకప్‌లో 2014 చాంపియన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గ్రూప్-ఈ మ్యాచ్‌లో జర్మనీపై 2-1తో గెలుపొందిన జపాన్.. నాకౌట్ దిశగా ఓ అడుగు ముందుకేసింది. మ్యాచ్‌లో బంతిని నియంత్రణలో ఉంచుకుని ఆధిపత్యం కోసం ప్రయత్నించిన జర్మనీకి జపాన్ భిన్నమైన సమాధానం ఇచ్చింది. ప్రథమార్థం ఆట 33వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న జర్మనీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇకారు గుండోగన్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ప్రథమార్థాన్ని జర్మనీ 1-0తో ముగించింది. ద్వితీయార్థంలోనూ దూకుడు చూపించిన జర్మనీకి.. వరుస గోల్స్‌తో షాక్ ఇచ్చింది జపాన్. 75వ నిమిషంలో రిట్సు డోన్ మెరుపు గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన టకుమ అసానో 83వ నిమిషంలో మరో గోల్‌తో జపాన్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. చివరి నిమిషాల్లో ఆట రక్తికట్టగా.. స్కోరు సమం చేసేందుకు జర్మనీ అన్ని ప్రయత్నాలు చేసింది. తాజా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ తొలి మ్యాచ్‌లో ఓడటం రెండోసారి కావటం విశేషం.