Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలీవర్, ఎంబపా మెరుపు గోల్స్
- 4-1తో ఆస్ట్రేలియాపై ఘన విజయం
- 2022 ఫిఫా ప్రపంచకప్
డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ వేటను ఘనంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఫ్రాన్స్ 4-1తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. వరల్డ్‌కప్‌కు వస్తూ.. కరీం బెంజమాన్ను కోల్పోయిన ఫ్రాన్స్ ఆటలో ఆ లోటు తెలియకుండా అదరగొట్టింది. మ్యాచ్‌లో తొలుత ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఫ్రాన్స్ దూకుడు ముందు నిలువలేదు. కంగారూలను మరీ కంగారు పెట్టేసిన ఫ్రాన్స్ ఖతార్‌లో ఖతర్నాక్ బోణీ కొట్టింది.
నవతెలంగాణ-అల్వుకైర్
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫోబియాను గోల్స్‌తో తన్నేసింది ఫ్రాన్స్. గ్రూప్-డి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 4-1తో తిరుగులేని విజయం నమోదు చేసింది. ప్రధాన స్ట్రయికర్ కరీం బెంజెమా సహా పలువురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయిన ఫ్రాన్స్.. ఖతార్‌లో ఖతర్నాక్ బోణీ కొట్టింది. సీనియర్ స్ట్రయికర్ ఒలీవర్ గిరౌడ్ సహా స్టార్ ఆటగాళ్లు కలియన్ ఎంబపా, రాబియట్ చెలరేగటంతో తొలి మ్యాచ్‌లో కండ్లుచెదిరే విజయం నమోదు చేసింది. రాబియట్ (27వ నిమిషం), గిరౌడ్ (32, 71వ నిమిషం), ఎంబపా (68వ నిమిషం) ఫ్రాన్స్ తరఫున గోల్స్ కొట్టారు. ఆస్ట్రేలియా తరఫున గుడ్విన్ (9వ నిమిషం) గోల్ నమోదు చేశాడు. ఫ్రాన్స్ చేతిలో ఓడినా ఆస్ట్రేలియా నాకౌట్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి!. ట్యూనిషియా, డెన్మార్క్ మ్యాచ్ డ్రా కావటంతో ఆస్ట్రేలియాకు నాకౌట్ దారులు తెరిచే ఉన్నాయి. గ్రూప్-డి అగ్రస్థానంపై తొలి మ్యాచ్ విజయంతోనే ఫ్రాన్స్ కన్నేసింది.
ఆసీస్ మెరుపు ఆరంభం : డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మ్యాచ్. ఫ్రాన్స్ అత్యంత బలంగా కనిపిస్తోంది. కానీ బల్లాన్ డీ అవార్డు విజేత కరీం బెంజెమా తొడ కండరం గాయంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. కీలక డిఫెండర్ ప్రసెల్ కింపెంబె, మిడ్ ఫీల్డర్లు గోలో కంటె, పాల్ పోగ్బా సహా స్ట్రయికర్ క్రిస్టోఫర్ కుంకూ గాయాలతో ప్రపంచకప్‌కు దూరమయ్యారు. దీనికి తోడు డిఫెండింగ్ చాంపియన్లకు ఫిఫా ప్రపంచకప్‌లో మంచి రికార్డు లేదు. మ్యాచ్ మొదలైన తొమ్మిదో నిమిషంలోనే ఆస్ట్రేలియా క్రెయిగ్ గుడ్విన్ చూడచక్కని గోల్ కొట్టాడు. ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించిన గుడ్విన్.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ ముందు గోల్ విన్యాసం చేశాడు. 9వ నిమిషంలోనే గుడ్విన్ గోల్‌తో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట 26వ నిమిషం వరకు ఆస్ట్రేలియా ఆధిక్యంలోనే నిలిచింది.
ఫ్రాన్స్ పంజా : ఎటాకింగ్‌లో ఫ్రాన్స్‌ను ఎదుర్కొవటం అంత సులువు కాదు. స్టార్ స్ట్రయికర్ కరీం బెంజెమా లేకపోయినా.. ఫ్రాన్స్ దూకుడులో పస ఏమాత్రం తగ్గలేదు. 27వ నిమిషంలో ఆస్ట్రేలియా పెనాల్టీ ఏరియాలో హెర్నాండేజ్ నుంచి లభించిన పాస్‌ను రాబియట్ గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్ స్కోరు సమం చేసింది. మరో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఫ్రాన్స్ మరో గోల్ కొట్టింది. ఈసారి రాబియట్ అందించిన పాస్‌ను గిరౌడ్ హెడర్‌తో గోల్ కొట్టాడు. దీంతో ఫ్రాన్స్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రథమార్థం ముగియడానికి క్షణాల ముందు ఆస్ట్రేలియా మరో గోల్ ప్రయత్నం చేసింది. అద్భుత కిక్ క్రాస్‌బార్‌కు తగటంతో ఆసీస్‌కు నిరాశ తప్పలేదు. ప్రథమార్థం ముగిసే సమయానికి ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలో కొనసాగింది.
ద్వితీయార్థంలో ఫ్రాన్స్ మరో రెండు గోల్స్ కొట్టింది. స్టార్ స్ట్రయికర్ కలియన్ ఎంబపా 68వ నిమిషంలో డెంబెలె నుంచి గోల్‌పోస్ట్ ముందు స్కై పాస్ అందుకు ఎంబపా.. ఇద్దరు ఆస్ట్రేలియాను డిఫెండర్లను బోల్తా కొట్టించి హెడర్ గోల్ నమోదు చేశాడు. ఎంబపా గోల్‌తో ఫ్రాన్స్ ఆధిక్యం 3-1కు మెరుగైంది. గిరౌడ్ 71 నిమిషంలో మరో హెడర్ గోల్‌తో ఆస్ట్రేలియా డిఫెన్స్‌ను ఛేదించాడు. దీంతో ఫ్రాన్స్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆట ఆఖర్లో, అదనపు సమయంలో సైతం ఫ్రాన్స్ ఎదురుదాడి కొనసాగించింది. ఫ్రాన్స్ ఎటాక్‌కు ఆస్ట్రేలియా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక ఆస్ట్రేలియాపై రెండు గోల్స్ కొట్టిన గిరౌడ్ ఫ్రాన్స్ తరఫున 51వ గోల్ నమోదు చేసి హెన్రీ రికార్డును సమం చేశాడు. ఇక మ్యాచ్‌లో 62 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న ఫ్రాన్స్.. ఆస్ట్రేలియా గోల్‌పోస్ట్‌పై 23 సార్లు దాడి చేసింది. ఏడు సార్లు గోల్‌కు దగ్గరైన ఫ్రాన్స్.. నాలుగు సార్లు విజయవంతమైంది. గ్రూప్-డిలో తర్వాతి మ్యాచుల్లో ట్యూనిషియాతో ఆస్ట్రేలియా తలపడనుండగా, డెన్మార్క్‌తో ఫ్రాన్స్ ఢకొట్టనుంది.