Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, కివీస్ రెండో వన్డే వర్షార్పణం
- మెరిసిన గిల్, సూర్యకుమార్
భారత్, న్యూజిలాండ్ వైట్‌బాల్ పోరును వరుణుడు వీడటం లేదు. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా.. తాజాగా వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ ఎడతెగని వర్షంతో ఫలితం తేలకుండా ముగిసింది. వర్షం అంతరాయానికి ముందు శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్) ధనాధన్ షోతో అభిమానులను అలరించారు. సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 30న క్రైస్చ్చర్చ్లో జరుగనుంది.
నవతెలంగాణ-హామిల్టన్
ఊహించినట్టే హామిల్టన్ సెడాన్ పార్క్ వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వన్డే పోరుకు అంతరాయం కలిగించి, విరామం ఇస్తుందని ఆశించగా.. పరిస్థితి భిన్నంగా సాగింది. రెండు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఓ సారి మ్యాచ్ ఓవర్ల కుదింపునకు కారణం కాగా, రెండోసారి ఏకంగా మ్యాచ్‌ను రద్దు చేసే నిర్ణయానికి దారితీశాడు. ఆటను రద్దు చేసే సమయానికి రెండో వన్డేలో భారత్ 89/1తో నిలిచింది. శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్, 42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. రెండో వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఇక సిరీస్‌లో మూడో వన్డే బుధవారం (నవంబర్ 30న) క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. వన్డే సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండేందుకు చివరి వన్డేలో భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. న్యూజిలాండ్ చివరి వన్డేలో ఓడినా.. సిరీస్‌ను కోల్పోలేదు. భారత్‌తో 1-1తో సమంగా ట్రోఫీని పంచుకుంటుంది. దీంతో బుధవారం చివరి వన్డే భారత్‌కు చావోరేవో కానుంది.
గిల్, సూర్య మెరుపులు : సెడాన్ పార్క్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ మళ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కఠిన పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియాకు ఆరంభం ఆశించినట్టు లభించలేదు. 4.5 ఓవర్లలో 22/0తో ఉన్న సమయంలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ఎడతెగని వర్షం, తడి అవుట్ ఫీల్డ్‌తో మ్యాచ్ పున ప్రారంభం ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (3)ను మాట్ హెన్రీ వెనక్కి పంపించగా.. శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్) మెరుపు షో అందించాడు. సూర్యకుమార్ యాదవ్ ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. తొలి వన్డేలో అర్థ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మరో అర్థ సెంచరీ దిశగా సాగాడు. కానీ 12.5 ఓవర్లలో భారత్ 89/1తో ఉన్న సమయంలో వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. విడువని వర్షం, సమయం మించిపోవటంతో రెండో వన్డే మళ్లీ మొదలు కాలేదు. ఫలితం తేలని వన్డే పోరును అంపైర్లు రద్దు చేశారు.
మా చేతుల్లో లేదు! : వాతావరణం, పరిస్థితులు మా చేతుల్లో ఉండవని భారత కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. 'వాతావరణం మా నియంత్రణలో లేదు. మెరుగైన వాతావరణం కోసం ఎదురుచూడటమే. సిరీస్‌లో చివరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను. హామిల్టన్ పిచ్ బాగుంది. పిచ్ నుంచి అధిక సీమ్ లభించింది. అయినా, బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఆరో బౌలింగ్ వనరు ఉండాలని అనుకున్నాం. అందుకే సంజు శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నాం. చాహర్ రూపంలో, అధిక స్వింగ్ రాబట్టే పేసర్, ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెట్టగల పేసర్ దీపక్ చాహర్. సీనియర్ ఆటగాళ్లందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఈ సిరీస్‌లో జట్టు బెంచ్ బలం తెలిసింది. కుర్రాళ్లపై నాకు నమ్మకం ఉంది. న్యూజిలాండ్‌లో నాణ్యమైన క్రికెట్ ఆడటం బాగుంది. ఈ పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ బాగా ఆడుతున్నాడు. చివరి మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ సైతం రాణించాడు. కుర్రాళ్లు రూపాంతరం, పరిణితి పొందే ప్రక్రియ చక్కగా ఉంది. జట్టుగా మేము ఈ ప్రక్రియను ఆస్వాదిస్తున్నాం. ఈ ప్రక్రియలో మేము సరిగ్గా సాగుతున్నాం, ఫలితాలు సైతం మాకు సరిగ్గానే వస్తాయని ఆశిస్తున్నామని' అని శిఖర్ ధావన్ తెలిపాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) ఫెర్గుసన్ (బి) హెన్రీ 3, శుభ్‌మన్ గిల్ నాటౌట్ 45, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 34, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 89.
వికెట్ల పతనం : 1-23.
బౌలింగ్ : టిమ్ సౌథీ 3-0-12-0, మాట్ హెన్రీ 4-0-20-1, లాకీ ఫెర్గుసన్ 2.5-0-24-0, మైకల్ బ్రాస్‌వెల్ 2-0-18-0, మిచెల్ శాంట్నర్ 1-0-9-0.