Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ది హండ్రెడ్‌లో వాటా కోసం..
లండన్ : ప్రపంచ క్రికెట్లో టీ20 లీగ్‌లు మార్కెట్‌ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మానస పుత్రిక ' ది హండ్రెడ్' లీగ్‌లో వాటా కోసం ఓ ప్రయివేటు సంస్థ ఏకంగా రూ.4 వేల కోట్ల ఆఫర్ చేసింది. ది హండ్రెడ్ లీగ్‌లో ఇరు జట్లు 100 బంతులు ఆడతాయి. రెండు సీజన్లు పాటు జరిగిన ది హండ్రెడ్ కోసం 2028 వరకు ఈసీబీ షెడ్యూల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ లీగ్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిడ్జ్‌పాయింట్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ది హండ్రెడ్‌లో 75 శాతం వాటా కోసం 400 మిలియన్ పౌండ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందులో సుమారు 300 మిలియన్ పౌండ్లను నేరుగా ఇంగ్లీష్ క్రికెట్ అభివృద్ది కోసం కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈసీబీ ప్రస్తుతం ఆదాయం కోసం అంతర్జాతీయ క్రికెట్‌పైనే ఆధారపడుతోంది. ది హండ్రెడ్ను సరికొత్త ఆదాయ వనరుగా మలిచేందుకు ఈసీబీ సిద్ధమవుతోంది. ది హండ్రెడ్ లీగ్‌ను మరింత అభివృద్ది చేయటంపైనే ఈసీబీ దృష్టి సారించిందని, దురాశతో వాటాను అమ్ముకునే ఆలోచన ఈసీబీ ఉందని తెలుస్తోంది. బ్రిడ్జ్‌పాయింట్ గ్రూప్ ఆఫర్‌పై స్పందించేందుకు ఈసీబీ వర్గాలు నిరాకరించాయి.