Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 గజాల దూరం నుంచి గోల్
- 2-0తో మెక్సికోపై అర్జెంటీనా గెలుపు
- 2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్
జట్టు ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నా, కచ్చితంగా నెగ్గాలనే తపనలో సహచర ఆటగాళ్లు తడబాటుకు లోనవుతున్నా.. ఆ బృందంలో లియోనల్ మెస్సీ ఉంటే ఇక ఆ జట్టుకు పెద్దగా బెంగ అక్కర్లేదు. ఎందుకంటే, ఒత్తిడిలో మాయజాలం ప్రదర్శించటం అతడికి కొత్త కాదు. ఓటమితో ఫిఫా ప్రపంచకప్‌ను ఆరంభించిన అర్జెంటీనా.. గ్రూప్ దశలో రెండో మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ మ్యాజిక్‌తో మెరుపు విజయం సాధించింది. నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
నవతెలంగాణ-లుసైల్ (ఖతార్)
సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తనదైన శైలిలో మరోసారి మ్యాజిక్ చేశాడు. మెక్సికోపై 2-0తో అర్జెంటీనాకు అద్వితీయ విజయాన్ని అందించాడు. ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు ఇదేమీ చిరస్మరణీయ విజయం కాకపోవచ్చు. కానీ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదం ఎదుర్కొంటున్న తరుణంలో.. లియోనల్ మెస్సీ మాయజాలంతో అర్జెంటీనా అద్భుత విజయం నమోదు చేసింది. 64వ నిమిషంలో లియోనల్ మెస్సీ గెలుపు గోల్ నమోదు చేయగా, 87వ నిమిషంలో ఫెర్నాండేజ్ అర్జెంటీనా ఆధిక్యాన్ని పెంచాడు. బలమైన జట్టుపై మెక్సికో రాణించినా.. గోల్ చేసేంత స్థాయిలో ఆ జట్టు ఆట లేదు. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో పోలెండ్‌తో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే గ్రూప్-సి నుంచి అర్జెంటీనా అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకునే అవకాశం ఉంది. బుధవారం జరుగనున్న అర్జెంటీనా, పొలెండ్.. మెక్సికో, సౌదీ అరేబియా మ్యాచులు గ్రూప్-సి నాకౌట్ బెర్తులు తేల్చనున్నాయి.
మెస్సీ మెరిసెన్ : గ్రూప్-సి ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై లియోనల్ మెస్సీ గోల్ కొట్టినా అర్జెంటీనా పరాజయం పాలైంది. ఆ ఓటమి మెస్సీ సేనపై ఒత్తిడి పెంచింది. మెక్సీకోపై గత 11 మ్యాచుల్లో ఓటమెరుగని రికార్డు కలిగిన అర్జెంటీనా.. ఖతార్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది.
అయితే, ప్రథమార్థంలో అర్జెంటీనా ఎదురుదాడి చేసేందుకు సరైన సందర్భం రాలేదు. ఫౌల్స్, స్టాపేజ్‌లతో అర్జెంటీనా జోరు సాగలేదు. కానీ ద్వితీయార్థంలో అర్జెంటీనాకు మరిచిపోలేని గోల్ అందించాడు మెస్సీ. మెక్సికో గోల్‌పోస్ట్‌కు 25 గజాల దూరంలో ఉన్న లియోనల్ మెస్సీ.. డిమారియో నుంచి అందుకున్న పాస్‌ను ఒడుపుగా గోల్‌పోస్ట్ కార్నర్‌లోకి నెట్టేశాడు. మెస్సీ మ్యాజిక్ గోల్‌తో సుసైల్ స్టేడియం అర్జెంటీనా అభిమానుల అరుపులతో హౌరెత్తింది. ఇక 87వ నిమిషంలో లియోనల్ మెస్సీ అందించిన పాస్‌ను ఫెర్నాండేజ్ గోల్‌గా మలిచాడు. అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెంచాడు. ప్రత్యర్థికి గోల్ ఇవ్వకుండా అర్జెంటీనా డిఫెన్స్ గొప్పగా నిలువరించింది. ఈ విజయంతో అర్జెంటీనా విలువైన 3 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్-సిలో రెండో స్థానానికి ఎగబాకింది.