Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగ్గా క్రికెటర్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్
- ఎన్సీఏ, ఐపీఎల్ ప్రాంఛైజీల ఉమ్మడి పర్యవేక్షణ
- బీసీసీఐ సమీక్షా సమావేశంలో నిర్ణయం
భారత క్రికెట్‌ను నిలకడగా వేధిస్తోన్న గాయాల బెడద, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు నడుం బిగించింది. స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సహా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ఆటగాళ్ల గాయాల బెడదను నియంత్రించేందుకు ఎన్సీఏ, ఐపీఎల్ ప్రాంఛైజీలు కలిసి పని చేయనుండగా.. వన్డే వరల్డ్‌కప్ కోసం 20 మందితో కూడిన ఆటగాళ్లను బోర్డు ఖరారు చేసినట్టు సమాచారం.
నవతెలంగాణ-ముంబయి
దిద్దుబాటు చర్యలు
2022 ఏడాది భారత క్రికెట్‌కు చేదుగా గడిచింది. చిరస్మరణీయ విజయాల కంటే చేదు పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బీసీసీఐ.. కొత్త ఏడాదిని సమీక్షా సమావేశంతో మొదలుపెట్టింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి, ఇంగ్లాండ్ చేతిలో ఐదో టెస్టు పరాజయం, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే నిష్క్రమణ, తాజాగా బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్‌లో పరాభవం బీసీసీఐ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మలు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాలతో పాటు ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ భేటిలో ఉన్నారు.
ఫిట్నెస్ నిలిపేదెలా? :
సమీక్షా సమావేశంలో పరాజయాలకు దారితీసిన కారణాలతో పాటు క్రికెటర్ల ఫిట్నెస్, గాయాల బెడదపై ప్రధానంగా చర్చ నడిచినట్టు తెలిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యారు. దీపక్ చాహర్ గత ఏడాది అంతా ఆటకు దూరంగా ఉన్నాడు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కలిగిన క్రికెటర్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్‌మ్యాప్‌పై చర్చ నడిచింది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాడు 100 శాతం ఫిట్నెస్తో ఉండాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటున్నట్టు కెప్టెన్ రోహిత్ తెలిపాడు.
ఎన్సీఏ, ప్రాంఛైజీలు జట్టుగా..! :
2023 భారత క్రికెట్‌కు అత్యంత కీలకం. కాసులు కురిపించే ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టు చరిష్మా పెంచేందుకు వన్డే వరల్డ్‌కప్ ముందున్నాయి. ఐపీఎల్లో ఆడుతూ కీలక ఆటగాళ్లు గాయపడి, వరల్డ్‌కప్‌కు దూరమైతే బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. ఆతిథ్య జట్టుగా ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లనే బరిలోకి దింపేందుకు బోర్డు నిశ్చయంగా ఉంది. అందుకే ఈ సీజన్ నుంచి భారత క్రికెటర్ల ఫిట్నెస్, పని భారం పర్యవేక్షణను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఐపీఎల్ ప్రాంఛైజీలు ఉమ్మడిగా చూసుకోనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టు ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకు ఫిట్నెస్, వర్క్‌లోడ్ రోడ్‌మ్యాప్‌ను ఎన్సీఏ ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఐపీఎల్ ప్రాంఛైజీలు సైతం భాగస్వామ్యం కానున్నాయి.
కొత్తగా డెక్సా స్కాన్స్ :
జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు సత్తా చాటితే చాలదు, ఫిట్నెస్ సైతం ఉండాలని విరాట్ కోహ్లి నాయకత్వంలో ఓ నిబంధన ప్రవేశపెట్టారు. ఆ రూల్ కారణంగా కొందరు జాతీయ జట్టుకు ఎంపికైనా ఫిట్నెస్ పరీక్షలో విఫలమై జట్టుకు దూరమయ్యారు. జట్టు ఎంపిక ప్రక్రియలో ప్రామాణిక ఫిట్నెస్ పరీక్ష యోయో టెస్టును మళ్లీ ప్రవేశపెట్టనున్నారు. యోయో టెస్టుకు అదనంగా డెక్సా స్కాన్స్‌ను కొత్తగా తీసుకురానున్నారు.
యోయో టెస్టులో ఆటగాడి ఫిజికల్ ఫిట్నెస్ స్థాయికి తేల్చుతారు. డెక్సా స్కాన్ టెస్టులో ఆటగాడి సైంటిఫిక్ ఫిట్నెస్ స్థాయిని నిర్ధారిస్తారు. డెక్సా స్కాన్‌తో.. ఎముక ఆరోగ్యం, కండరాల ఆరోగ్యం, శరీరంలో కొవ్వు శాత, ఎముక-కండరాల నిష్పత్తి వంటి వివరాలు తెలుస్తాయి. ఈ నివేదికతో గాయాల బారిన పడే ప్రమాదం ఉన్న క్రికెటర్లను గుర్తించి, రిహాబిలిటేషన్‌లో ఉంచుతారు.
దేశవాళీ అనుభవం
జాతీయ జట్టు ఎంపికకు తొలినాళ్లలో ఐపీఎల్ ప్రదర్శన పెద్దగా పరిగణనలోకి తీసుకునేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో ఓ ఐపీఎల్ సీజన్లో రాణిస్తే జాతీయ జట్టులో చోటు సంపాదించటం తేలిక అవుతుంది. అదే దేశవాళీ సీజన్లో మెరిసిన ఆటగాళ్లకు అంత ప్రాముఖ్యత దక్కటం లేదు. ఐపీఎల్ మెరుపులతో జాతీయ జట్టులోకి వచ్చిన క్రికెటర్లు ఫిట్నెస్ను సైతం వేగంగా కోల్పోతున్నారు. కొంతమంది క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్ సీజన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సైతం బోర్డు దృష్టిలో వచ్చింది. దీంతో జాతీయ జట్టు ఎంపిక కొలమానాల్లో విశేష దేశవాళీ సర్క్యూట్ అనుభవం తప్పనిసరి చేసింది బోర్డు. ఏదో ఒక ఫార్మాట్ కాకుండా, అన్ని ఫార్మాట్లలోనూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని నిబంధనలు పెట్టింది. దేశవాళీ క్రికెట్ ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు ఈ ప్రతిపాదన దోహదం చేయగలదు.
20 మందితో ప్రాబబుల్స్?!
బీసీసీఐ సమీక్షా సమావేశంలో 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ రోడ్‌మ్యా చ్‌పై చర్చించినట్టు బోర్డు స్పష్టంగా తెలిపింది. కానీ, ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం సైతం తీసుకున్నట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. స్వదేశంలో జరుగనున్న మెగా ఈవెంట్‌కు 20 మందితో కూడిన ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో ఈ 20 మంది ఆటగాళ్లను రొటేషన్ పద్దతిలో ఆడించే ఆలోచన కనిపిస్తోంది. జట్టులో ప్రతి స్థానానికి అంతే మెరుగైన ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంచేందుకు బీసీసీఐ ఈ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
సీఏసీ తొలి భేటీ!
బీసీసీఐ కొత్తగా నియమించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సమావేశమైంది. అశోక మల్హోత్రా, జతిన్ పరంజిపె, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. నూతన సెలక్షన్ కమిటీ సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది. వెంకటేశ్ ప్రసాద్, శ్రీధరన్ శరత్, ముకుంద్ పర్మార్, సలీల్ అంకోలా, రీతిందర్ సింగ్ సోధి, శివ సుందర్ దాస్, రిజ్వాన్ శంశద్లు సెలక్షన్ కమిటీ రేసులో ముందున్నారు. క్రికెట్ సలహా కమిటీ త్వరలోనే సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌కు నూతన సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.