Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొట్టి ఫార్మాట్లో సరికొత్తగా భారత జట్టు
- భారత్, శ్రీలంక తొలి టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2023 వన్డే వరల్డ్‌కప్ ఏడాది. టీ20లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అయినా, కొత్త ఏడాదిలో టీమ్ ఇండియా పొట్టి పోరు ఆసక్తి సంతరించుకుంది. యువ జట్టుతో కూడిన టీమ్ ఇండియా.. 20 ఓవర్ల ఆటలో సరికొత్త పంథాలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. భయమెరుగని క్రికెట్, బ్రేకుల్లేని దూకుడు ఆట తీరుకు శ్రీలంకతో సిరీస్‌లో నాంది పడనుంది!. ఆసియా చాంపియన్స్ శ్రీలంకతో భారత్ తొలి టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-ముంబయి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా.. భారత ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఈ ఆటగాళ్లు ఎవరూ లేరు. విభిన్న కారణాలతో టీ20 సిరీస్‌కు దూరమైనా.. యువ జట్టును బరిలోకి దిగనుండటం యాదృఛ్చికం కాదు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ దిశగా టీమ్ ఇండియా యువ క్రికెటర్లతో కూడిన జట్టును సిద్ధం చేయటంలో భాగంగానే ఈ సిరీస్‌ను చూడాలి. యువ నాయకుడు హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ నూతన ఏడాదిని విజయంతో మొదలుపెట్టేందుకు ఎదురుచూ స్తోంది. దశున్ శనక నాయకత్వంలోని లంకేయుల సేన సవాల్ విసిరేందుకు సిద్దంగా ఉండగా.. నేడు వాంఖడేలో భారత్, శ్రీలంక తొలి టీ20 మ్యాచ్.
యువ జోరు
వరుసగా రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లలో పేలవ ప్రదర్శన చేసిన భారత్.. 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు చూపుతో వెళ్లనుంది. సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ జట్టును వచ్చే ఏడాది మెగా వార్‌కు సన్నద్ధం చేయనుంది. ఈ ప్రక్రియకు శ్రీలంకతో టీ20 సిరీస్ నాంది కానుంది. నిరుడు జూన్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేని వేళ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. బంగ్లాదేశ్‌పై ధనాధన్ ద్వి శతకంతో ఇషాన్ కిషన్ జట్టు మేనేజ్మెంట్ నమ్మకాన్ని సంపాదించాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ సీజన్లో శతకాల మోత మోగించాడు. ఈ ఇద్దరూ నేడు ఓపెనర్లుగా రానున్నారు. శుభ్‌మన్ గిల్ అరంగేట్రం కోసం వేచి చూడక తప్పదు. అయితే తొలి 10 బంతుల్లో రుతురాజ్ 98.33, కిషన్ 111.26 స్ట్రయిక్‌రేట్ కలిగి ఉన్నారు. దూకుడు మంత్ర పఠించే యువ జట్టు ఓపెనర్లుగా ఈ జోడీ తొలి బంతి నుంచీ ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాలి. పొట్టి ఫార్మాట్ ఉత్తమ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భారత్‌కు కీలకం. సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడాలు బ్యాట్‌తో కీలకం కానున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో నిలువనున్నాడు. ఆరు మాసాల క్రితమే అరంగేట్రం చేసిన యువ పేసర్ అర్షదీప్ సింగ్ నేడు భారత పేస్ దళానికి సారథ్యం వహించనున్నాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన యుజ్వెంద్ర చాహల్.. అక్షర్ పటేల్‌తో పోటీపడుతున్నాడు. లోతైన బ్యాటింగ్ లైనప్ అవసరమైతే అక్షర్ పటేల్‌ను ఎంచుకునే వీలుంది. రాహుల్ త్రిపాఠికి ఈ సిరీస్‌లో కచ్చితంగా ఓ అవకాశం దక్కనుంది.
ఆసియా ఉత్సాహం
2022 టీ20 ప్రపంచకప్ అనంతరం శ్రీలంక జట్టు పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. భారత్ ఆసీస్ నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ టీ20 సిరీస్‌లో పైచేయి సాధించింది. ప్రపంచకప్‌లో తేలిపోయినా.. దశున్ శనక సారథ్యంలోని శ్రీలంక మెరుగైన జట్టు. యువ క్రికెటర్లతో కూడిన భారత్ కొత్త బాధ్యతలకు అలవాటు పడేందుకు సమయం పట్టవచ్చు. కానీ శ్రీలంకకు అటువంటి పరిస్థితి లేదు. అండర్‌డాగ్‌గా బరిలో నిలిచి ఆసియా చాంపియన్‌గా అవతరించిన సైతం టీ20 సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. నిశాంక, కుశాల్ మెండిస్, అసలంకకు తోడు భానుక రాజపక్స, శనకలు ఆ జట్టుకు కీలకం కానున్నారు. ఇక స్పిన్నర్ వానిందు హసరంగ భారత్‌కు సవాల్ విసరనున్నాడు. భారత్‌పై ఏడు టీ20ల్లో 10 వికెట్లు పడగొట్టిన హసరంగ 6.79 ఎకానమీతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగల హసరంగను నేడు భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మహీశ్ తీక్షణ తోడుగా హసరంగ స్పిన్ మాయ చేయనున్నాడు. దిల్షాన్ మధుశంక, లహిరు కుమారలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్, వాతావరణం
వాంఖడే పిచ్ సహజంగానే పరుగుల వరదకు చిరునామా. ఇక్కడి చిన్న బౌండరీలు బ్యాటర్లకు రెట్టింపు ఉత్సాహం అందిస్తాయి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు అధికం. గత రెండేండ్లలో ఇక్కడ జరిగిన 41 టీ20ల్లో 24 మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విజయం సాధించింది. భారత్, శ్రీలంక టీ20 మ్యాచ్‌లోనూ అటువంటి ఫలితమే పునరావృతం కావచ్చు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఎటువంటి వర్షం సూచనలు కనిపించటం లేదు!.
తుది జట్లు (అంచనా)
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వెంద్ర చాహల్.
శ్రీలంక : నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధసున్ శనక (కెప్టెన్), వానిందు హసరంగ, చామిక కరుణరత్నె, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక, లహిరు కుమార.
ఇక కిల్లర్ జెర్సీ
నూతన ఏడాదిలో భారత క్రికెట్ జట్టు కిట్, లోగో స్పాన్సర్షిప్ చేతులు మారింది. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నూతన జెర్సీలు ధరించనున్నారు. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేకపోయినా.. కిట్ స్పాన్సర్, లోగో స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్థానంలో కిల్లర్ రానుంది. కెవాల్ కిరణ్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకు హక్కులు బదలాయిస్తూ ఎంపీఎల్ నిష్క్రమించింది. మార్చి వరకు కొనసాగాలని బోర్డు కోరినా.. ఎంపీఎల్ విముఖత చూపింది. దీంతో కిల్లర్ జీన్స్ వేర్ తయారీ సంస్థ కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మరో స్పాన్సర్ బైజూస్ సైతం వైదొలిగేందుకు సిద్ధంగా ఉంది. మార్చి అనంతరం బీసీసీఐ కొత్త స్పాన్సర్షిప్ కోసం టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది.