Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి వన్డేలో భారత్ ఘన విజయం
- రాణించిన రోహిత్, గిల్, సిరాజ్
- సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం
విరాట్ కోహ్లి (113) శతకంతో చెలరేగాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్థ సెంచరీలతో రాణించారు. టాప్-3 బ్యాటర్లు కదం తొక్కటంతో తొలుత 373 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన టీమ్ ఇండియా.. గువహటి వన్డేలో శ్రీలంకను చిత్తు చేసింది. ఛేదనలో శ్రీలంక 306 పరుగులే చేయగా భారత్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది.
నవతెలంగాణ-గువహటి
శ్రీలంకపై తొలి వన్డేలో భారత్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల వరద పారిన గువహటి వన్డేలో పర్యాటక జట్టును చిత్తు చేసిన టీమ్ ఇండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి (113, 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ శతకానికి తోడు ఓపెనర్లు రోహిత్ శర్మ (83, 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (70, 60 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాటర్లు మెరవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. పేసర్లు ఉమ్రాన్ మాలిక్ (3/57), మహ్మద్ సిరాజ్ (2/30) నిప్పులు చెరగటంతో ఛేదనలో శ్రీలంక 306 పరుగులకే పరిమితమైంది. 206/8తో ఓటమి ఖాయం చేసుకున్న శ్రీలంకకు కెప్టెన్ దశున్ శనక (108 నాటౌట్, 88 బంతుల్లో 12 ఫోవర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ ఊరట కలిగించింది. కెరీర్ 45వ వన్డే సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. భారత్, శ్రీలంక రెండో వన్డే కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో గురువారం జరుగనుంది.
టాప్-3 దూకుడు : బ్యాటింగ్ పిచ్‌పై టాస్ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా చేతిలో వన్డే సిరీస్ నుంచి వచ్చిన రోహిత్‌సేన.. లంకేయులపై బ్యాంగ్ బ్యాంగ్ ఆరంభం చేసింది. ఓపెనర్లు రోహిత్ (83), గిల్ (70) దంచికొట్టారు. తొలి వికెట్‌కు 19.4 ఓవర్లలోనే 143 పరుగులు పిండుకున్నారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 బంతుల్లో రోహిత్ అర్థ సెంచరీ సాధించగా, ఏడు ఫోర్లతో 51 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. అదిరే ఆరంభాన్ని అందించిన ఓపెనర్లు అర్థ సెంచరీల అనంతరం నిష్క్రమించగా.. నం.3 బ్యాటర్ విరాట్ కోహ్లి (113) ఆ తర్వాత కథ చూసుకున్నాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి సావధానంగా ఇన్నింగ్స్ మొదలెట్టిన విరాట్..మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అర్థ సెంచరీ అనంతరం కోహ్లి ఇన్నింగ్స్‌లో అమాంతం వేగం పెరిగింది. మరో 33 బంతుల్లోనే 50 పరుగులు కొట్టిన కోహ్లి.. 80 బంతుల్లో కెరీర్ 45వ వన్డే శతకం అందుకున్నాడు. ఓ ఎండ్‌లో కోహ్లి దంచికొట్టగా.. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (28), కెఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్య (14) చక్కగా సహకరించారు. ఓ దశలో భారత్ 400 మార్క్ తాకుతుందని అనిపించింది. కానీ కోహ్లి నిష్క్రమణ తర్వాత చివర్లో భారత్ ఆశించిన వేగంగా పరుగులు సాధించలేదు. నిర్ణీత ఓవర్లలో భారత్ 7 వికెట్లకు 373 పరుగులు చేసింది.
పేసర్ల ప్రతాపం : తొలుత భారత్ 373 పరుగుల భారీ స్కోరుతో మ్యాచ్‌ను ఏకపక్షం చేయగా.. పేసర్ల విజృంభణతో శ్రీలంక సైతం ఆరంభంలోనే ఆశలు వదులుకుంది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వరుస వికెట్లతో శ్రీలంకను దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఫెర్నాండో (5), కుశాల్ మెండిస్ (0)లను స్వల్ప స్కోర్లకే సాగనంపాడు. స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ సైతం జోరందుకోవటంతో శ్రీలంక పతనం వేగవంతమైంది. అసలంక (23), డునిత్ (0), నిశాంక (72) వికెట్లతో మాలిక్ మ్యాచ్‌ను లాంఛనం చేశాడు. ఆరంభంలో ఓపెనర్ నిశాంక అర్థ సెంచరీతో శ్రీలంక స్కోరు బోర్డును కదిలించగా.. చివర్లో ఆ బాధ్యతను కెప్టెన్ శనక (108 నాటౌట్) తీసుకున్నాడు. 206/8తో ఉన్న శ్రీలంకకు తొమ్మిదో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. 88 బంతుల్లో సెంచరీ సాధించిన శనక శ్రీలంక శిబిరంలో ఊరట కలిగించాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించటంతో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులే చేసింది. 63 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (బి) మధుశంక 83, గిల్ (ఎల్బీ) శనక 70, కోహ్లి (సి) మెండిస్ (బి) రజిత 113, శ్రేయస్ (సి) ఫెర్నాండో (బి) డిసిల్వ 28, రాహుల్ (బి) రజిత 39, పాండ్య (సి) హసరంగ (బి) రజిత 14, అక్షర్ (సి) ఫెర్నాండో (బి) కరుణరత్నె 9, షమి నాటౌట్ 4, సిరాజ్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 373.
వికెట్ల పతనం : 1-143, 2-173, 3-213, 4-303, 5-330, 6-362, 7-364.
బౌలింగ్ : రజిత 10-0-88-3, మధుశంక 6-0-43-1, హసరంగ 10-0-67-0, కరుణరత్నె 8-0-54-1, డునిత్ 8-0-65-0, శనక 3-0-22-1.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (సి) అక్షర్ (బి) మాలిక్ 72, ఫెర్నాండో (సి) హార్దిక్ (బి) సిరాజ్ 5, మెండిస్ (బి) సిరాజ్ 0, అసలంక (సి) రాహుల్ (బి) మాలిక్ 23, డిసిల్వ (సి) రాహుల్ (బి) షమి 47, శనక నాటౌట్ 108, హసరంగ (సి) శ్రేయస్ (బి) చాహల్ 16, డునిత్ (సి) గిల్ (బి) మాలిక్ 0, కరుణరత్నె (సి) రోహిత్ (బి) హార్దిక్ 14, రజిత నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306.
వికెట్ల పతనం : 1-19, 2-23, 3-64, 4-136, 5-161, 6-178, 7-179, 8-206.
బౌలింగ్ : షమి 9-0-67-1, సిరాజ్ 7-1-30-2, హార్దిక్ 6-0-33-1, మాలిక్ 8-0-57-3, చాహల్ 10-0-58-1, అక్షర్ 10-0-58-0.