Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రోఫీ ప్రదానం చేసిన హ్యాండ్‌బాల్ చీఫ్ జగన్
హైదరాబాద్: హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ కప్ ట్రోఫీని పురుషుల విభాగంలో భారత రైల్వేస్ జట్టు, మహిళల విభాగంలో రాజస్థాన్ జట్టు కైవసం చేసుకున్నాయి. గత కొద్దిరోజులుగా రాజస్థాన్‌లో జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. పురుషుల ఫైనల్లో రైల్వేస్ 35-25తో సర్వీసెస్ జట్టుపై నెగ్గగా, ఉత్కంఠభరితంగా జరిగిన మహిళల ఫైనల్లో రాజస్థాన్ 22-21తో హరియాణాపై గెలిచి ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ కోశాధికారి ఆనందీశ్వర్ పాండేతో కలిసి, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్ఏఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు విజేత జట్లకు ట్రోపీలను, పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్‌కు దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుందని అన్నారు. కిందటి ఏడాది హైదరాబాద్ వేదికగా ఆసియా క్లబ్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించామని.. భవిష్యత్‌లో భారత్ వేదికగా మరిన్ని ప్రతిష్టాత్మక టోర్నమెంట్లను నిర్వహిస్తామని అన్నారు. ఏడాదిన్నరగా తాము చేస్తున్న కషి ఫలితంగా అంతర్జాతీయ వేదికల్లో భారత యువ జట్లు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు.
2028 ఒలింపిక్స్ కల్లా భారత్ జట్టును ప్రపంచంలోని టాప్-10 జట్లలో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. ఐఓఏ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) సహకారంతో తప్పనిసరిగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని జగన్మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.