Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన వేదికగా రామ్‌లీలా మైదానం?
- తీవ్రంగా పరిశీలిస్తున్న మల్లయోధులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఏడుగురు మహిళా రెజ్లర్లు సహా ఓ మైనర్ రెజ్లర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆందోళన 24వ రోజుకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అసమాన విజయాలు సాధించి దేశం గర్వపడే ప్రదర్శనలు చేసిన సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు గత మూడు వారాలకు పైగా దేశ రాజధానిలో రోడ్డుపై కూర్చుని న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. సుప్రీంకోర్టు ఆదేశంతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదు. భారత స్టార్ మహిళా రెజ్లర్లకు అన్యాయం జరిగినా.. జోక్యం చేసుకునేందుకు ప్రధానమంత్రి నరెంద్ర మోడి ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో రెజ్లర్ల న్యాయ పోరాటాన్ని జాతీయ ఉద్యమంగా మలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు మే 21 వరకు రెజ్లర్లు గడువు విధించారు. గడువు లోగా ఢిల్లీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే.. ఆందోళనను జంతర్ మంతర్ నుంచి రామ్‌లీలా మైదానానికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
అదే పట్టుదల : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ చట్ట ప్రకారం శిక్ష అనుభవించాలని రెజ్లింగ్ క్రీడాకారులు 24 రోజులుగా అదే పట్టుదలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. రెజ్లర్ల ఆందోళనకు రోజురోజుకు మద్దతు గణనీయంగా పెరుగుతూనే ఉంది. మంగళవారం జంతర్‌మంతర్ వద్ద మల్లయోధులను కలిసిన భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ రెజ్లర్లకు కీలక సూచనలు చేశారు. 'జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు ఎంతకాలం కూర్చున్నా ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది మీ ఉద్యమం. మేము మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మే 21 గడువు ముగిసిన అనంతరం ఆందోళన జంతర్ మంతర్ వద్దే కొనసాగించాలా? విశాలమైన రామ్‌లీలా మైదానానికి తరలించాలా? అనేది నిర్ణయం తీసుకోండి' అని ఆజాద్ సూచించారు. 'ఆందోళనను రామ్‌లీలా మైదానానికి తరలించటంపై రెజ్లర్లతో కలిసి చర్చిస్తాం. దీన్ని జాతీయ ఉద్యమంగా మలిచేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని' సాక్షి మాలిక్ తెలిపింది.
లైంగిక వేధింపులకు గురైన భారత మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేలా అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల మద్దతు కోరతామని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మల్లయోధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాన్ని సైతం అడ్హాక్ కమిటీ పరిశీలిస్తోంది. రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా క్రీడా, పౌర సమాజం నుంచి మద్దతు వెల్లువెత్తుతుండగా.. రామ్‌లీలా మైదానం వేదికగా జాతీయ ఉద్యమం యోచనను రెజ్లర్లు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.