Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనం వదలని మాజీ ఏపీడీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి (టీశాక్స్) హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత రాష్ట్రం కోసం ఎంత పని చేస్తుందో, ఏమో గానీ ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటుంది. అందులో పని చేసే ఉన్నతాధికారులపై ఆరోపణలు కొనసాగుతున్న వైనం విదితమే. అయితే ఏండ్ల తరబడి ఆ సంస్థలో ఏపీడీగా పని చేసిన అధికారి ఇటీవల బదిలీ అయ్యారు. డీహెచ్ వద్ద రిపోర్ట్ చేశారు. అయినప్పటికీ టీశాక్స్లో ఎక్కువ సమయం గడపటంతో అక్కడి సిబ్బంది విధి నిర్వహణ ఇబ్బందికరంగా మారినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పైపెచ్చు అంతకు ముందు ఏపీడీగా ఆమె వాడిన వాహనాన్ని రిలీవ్ తర్వాత కూడా ఉపయోగించు కుంటున్నట్టు సమాచారం. గతంలో ఎన్జీవోలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించకపోయినా నిధులు విడుదల చేశారనీ, నియామకాల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని కాదనీ, తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. తమ పట్ల అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అవమానిస్తున్నదని ఉద్యోగులు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. దీనికి తోడు రిలీవ్ తర్వాత కూడా వాహనాన్ని ఉపయోగించుకుంటూ హెచ్ఐవీ రోగుల డబ్బులను వధా చేస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. టీశాక్స్ కార్యక్రమాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.