Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహం వద్ద మానహారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం...భావప్రకటాన స్వేచ్ఛను కాపాడుకుందాం' అంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నినదించాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత అని పేర్కొన్నాయి. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా మాట్లాడినా, ఆ విధంగా ప్రవర్తించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు కూడా దాన్ని చేతిలోకి తీసుకోకూడదని తెలిపాయి. ఎవరు ఎవరిపైనా దాడులకు పాల్పడరాదని స్పష్టం చేశాయి. సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు పార్టీలు, సంఘాల నేతలు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడుతున్నదని విమర్శించారు. మతోన్మాద, రాజకీయ శక్తులు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో భాగంగానే నేడు అభ్యుదయవాదులు, అంబేద్కర్‌వాదులు, హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో డా.నరేంద్ర దభోల్కర్, డా.గోవింద్ పన్సారే, కర్ణాటకలో ప్రొ.ఎం.ఎం. కల్బుర్గి, గౌరి లంకేష్‌ల హత్యలతో ఆడిన రాజకీయ వికృత క్రీడను నేడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ నేత పాండురంగాచారి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, కవి జయరాజ్, స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ రమేష్, ప్రజాసంఘాల నేతలు జాన్ వెస్లీ, స్కైలాబ్ బాబు, ఆర్ శ్రీ రామ్ నాయక్, ఎం. వి రమణ, ఝాన్సీ, గోవర్ధన్, సంధ్య, జ్యోతి, ఆర్ అంజయ్య నాయక్, నాగరాజు, కోట రమేష్,వెంకటేష్, విజరు, వహీద్, ప్రదీప్, కోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.