Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రంలో 23వేల మంది వీఆర్ఏలు ఉన్నారనీ, వారందరినీ పేస్కేల్ ఎంప్లాయిస్‌గా గుర్తిస్తామనీ, అర్హులకు పదోన్నతులు కల్పిస్తామనీ, 55ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని తమ్మినేని గుర్తుచేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపిస్తూ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను తమ్మినేని లేఖలో ప్రస్తావించారు. వీఆర్ఏల ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్, అప్పటి సీఎస్ సోమేష్‌కుమార్ వారికి స్పష్టమైన హామీలిచ్చారని తెలిపారు. వీఆర్ఏ సంఘాల ప్రతినిధులను ప్రగతిభవన్‌కు పిలిచి వారితో మంత్రి కేటీఆర్, సీఎంఓ అధికారులు చర్చలు జరిపి డిసెంబర్ 22న సీఎం సమక్షంలో వివరంగా చర్చిద్దామని చెప్పి ఇప్పటి వరకు వాటిపై స్పందించలేదని అన్నారు. వీఆర్ఏల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులకు చెందినవారేనని పేర్కొన్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ విధులను వారితోనే చేయిస్తున్నారని తెలిపారు. పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్‌కార్డులు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, మెటర్నటీ, క్యాజువల్ సెలవులు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో.. ఇప్పటికే కొంతమంది ఆర్ధిక, మానసిక బాధతో మరణించారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వీఆర్ఏలు 80 రోజుల పాటు నిరసనలు, సమ్మెలు చేసారని, ఆ సమయంలో 65 మందికి పైగా మరణించారని తమ్మినేని గుర్తుచేశారు. ప్రభుత్వ హామీపై నమ్మకంతో వీఆర్ఏలు సమ్మె విరమించి 100 రోజులు గడిచిందని పేర్కొన్నారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) పార్టీ సెప్టెంబర్ ఆరున సీఎం దష్టికి కూడా తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వీఆర్ఏలతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ్మినేని విజ్ఞప్తి చేశారు.