Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ అరాచకాలపై త్వరలో ఛార్జీషీట్ విడుదల చేస్తామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే బీజేపీపై ఏఐసీసీ చార్జీషీట్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు వైఫల్యం చెందాయన్నారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామంటిరి ఏమైందని ప్రశ్నించారు. వారానికో అంశంపై చార్జీషీట్ విడుదల చేసి, ప్రభుత్వ విధానాలను ఎండగడతామని తెలిపారు.
బ్రష్టు జుమ్లా పార్టీ (బీజేపీ), బందిపోటుల రాక్షసుల సమితి (బీఆర్ఎస్)గా నామకరణం చేసినట్టు తెలిపారు. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుంచి 119 నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ మాట్లాడుతూ స్మితాసబర్వాల్ ఇంటిలో ఆగంతుకుడి ప్రవేశంపై ఇప్పటికి కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో చనిపోయిన ఆ ఇద్దరి ఆచూకీ ఎక్కడీ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఈ రెండు నెలలపాటు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. మల్లు రవి మాట్లాడుతూ బీఆర్ఎస్ నియంత పాలన, సీఎం కేసీఆర్ అబద్ధాల(108)పై త్వరలో పుస్తకాన్ని విడుదల చేస్తామన్నారు.