Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017పరీక్ష అభ్యర్థుల ఆందోళన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఈటీ అభ్యర్థుల సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి పిల్లలతో సహా తరలివచ్చిన అభ్యర్థులు.. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు రోడ్డుపై బైటాయించారు. కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సదానంద్ గౌడ్ మాట్లాడుతూ.. 2017 సెప్టెంబర్‌లో గురుకుల పోస్టులకు పీఈటీ పరీక్షలు రాసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదన్నారు. కమిషన్ చైర్మెన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడించకపోవడంతో మనస్తాపానికి గురై 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తుందన్నారు. 616 పోస్టులకుగానూ 1:2 ప్రాతిపదికన 1232 మంది అభ్యర్థులు గతంలో ఎంపిక అయ్యారని తెలిపారు. ఇంతవరకు వాటి వివరాలు వెబ్సైట్లో పెట్టలేదన్నారు. అభ్యర్థులకు కుటుంబ పోషణ భారం అవుతోందని.. వారు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని వెంటనే ఫలితాలు ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.