Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ -హైదరాబాద్
తెలుగుదేశం చేపట్టనున్న ''ఇంటింటికి టీడీపీ'' కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి కరపత్రాన్ని అందచేయనున్నామని ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. దీనిపై కార్యచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర విస్త్రృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇంటింటికి టీడీపీ, కమిటీలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. ''ఇంటింటికి టీడీపీ'' కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ రూపొందించిన వీడియోను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం అమలుకు మండల, మున్సిపల్, డివిజన్ వంటి స్థానిక సంస్థలను యూనిట్లుగా తీసుకొంటున్నామని అన్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో మానిటరింగ్ కమిటీ ఉంటుందని చెప్పారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ప్రకారం రెండు సంవత్సరాల ముందే అభ్యర్థులను ప్రకటించి, వారికి బాధ్యతలు అప్పగించనున్నామని వివరించారు. శాసనసభ ఎన్నికలముందే స్థానిక సంస్థలలో నాయకత్వాన్ని ప్రకటించనున్నామని అన్నారు. ప్రతి చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయనున్నట్టు తెలిపారు. సభ్యత్వ నమోదులో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించిన తర్వాత నిజామాబాద్‌లో సభను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, కంభంపాటి రామమోహన్ రావు మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ విజయవంతమైందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలో అన్నదానిపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని, తెలుగుయువత అధ్యక్షులు పోగాకు జయరామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.