Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావుకు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులకు, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత వైద్య సహాయాన్ని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం, పీఆర్టీయూ-టీఎస్, తెలంగాణ రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సోమవారం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్, రాయకంటి ప్రతాప్‌ల నేతృత్వంలో ఆయా సంఘాల నాయకులు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల్ అందరూ నగతురహిత వైద్య సదుపాయం అమలు కోసం ఒక శాతం మూలవేతనంలో చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అందుకనుగుణంగా ప్రభుత్వం కూడా తన వాటాగా నగదును ట్రస్ట్‌కు చెల్లించాలని కోరారు. జీవో నెంబర్ 317 అమలులో భార్యా,భర్తల బదిలీల ప్రక్రియను చేపట్టాలనీ, ఉద్యోగులకు ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించాలనీ, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలనీ, డిఏలను మంజూరు చేయాలనీ, పెండింగ్ పిఆర్సి జీవోలను విడుదల చేయాలనీ, రాష్ట్రంలో ఈ ఏడాది జులై ఒకటి నుంచి అమలయ్యేలా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన హరీష్ రావు ఈహెచ్ఎస్ అమలుకు ఆదేశాలు జారీ చేసి వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని వైద్యారోగ్యశాఖ రిజ్వీని ఆదేశించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు రిజ్వీతో చర్చించి జీవో వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. నగదు రహిత ఆరోగ్య పథకం అమలు కోసం ఉత్తర్వులు జారీ చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు , ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, పీఆర్ టీయూ-టీఎస్ అద్యక్షులు శ్రీపాల్ రెడ్డి, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులున్నారు.