Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పౌర స్పందన వేదిక
- ప్రధానికి కొరియర్ ద్వారా వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ (2023-24)లో విద్యారంగానికి 10 శాతం, వైద్య రంగానికి ఆరుశాతం చొప్పున కేటాయించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కొరియర్ ద్వారా 13789 సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. హైదరాబాదులో 2035 సంతకాలు, రంగారెడ్డిలో 3503, మేడ్చల్ జిల్లాలో 1255, నల్లగొండలో 1254, సూర్యాపేటలో 3115, ఖమ్మంలో 1634,యాదాద్రి-భువనగిరిలో 710, హన్మకొండలో 283 మంది ద్వారా సంతకాలు సేకరించినట్టు పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎం.రాధేశ్యాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొఠారి కమిషన్ (1964-66) కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలని సిఫారసులు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆయా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను సైతం నానాటికీ కుదిస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి కేంద్ర బడ్జెట్లో కనీసం ఆరు శాతం నిధులు కేటాయించాల్సి ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ ఆయా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శించారు. గత ఐదేండ్లలో విద్యకు 3,04 శాతం, 3.04శాతం, 3.26 శాతం, 2.67 శాతం, 2.64 శాతం చొప్పున, వైద్యానికి 2.16 శాతం, 2.23శాతం, 2.02 శాతం, 2.01 శాతం, 2.01 శాతం చొప్పున మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనదేశాన్ని ఒకటిగా నిలపాలంటే ఈ కేటాయింపులు సరిపోవని పేర్కొన్నారు. రాబోవు బడ్జెట్లో (2023-24) విద్యారంగానికి 10 శాతం, వైద్య రంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.