Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 1 నాటికి రెండేండ్ల సర్వీసు ఉన్నోళ్లే అర్హులు
- అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వని ప్రభుత్వం
- టీచర్లు 8 ఏండ్లు, హెచ్ఎంలు 5 ఏండ్లు పనిచేస్తే స్థానచలనం తప్పనిసరి
- మార్గదర్శకాల రూపకల్పనలో విద్యాశాఖ అధికారులు
- అతి త్వరలోనే ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగంసిద్ధమైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఇక మార్గదర్శకాల రూపకల్పనలో విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండేండ్ల సర్వీసు నిండిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడంలేదు. అంటే కొందరికే బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హులుగా ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)ల సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి వారికి ఇచ్చినట్టు తెలిసింది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి రెండేండ్ల సర్వీసు ఉండాలని నిర్ణయించింది. ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యాజమాన్యాల వారీగా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలుంటాయని స్పష్టం చేసింది. ఎన్సీసీ అధికారులకు మాత్రం ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశమున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నాటికి ఒక పాఠశాలలో ఐదేండ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం), ఎనిమిదేండ్లు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుందని ప్రకటించింది. మూడేండ్లలోపు ఉద్యోగ విరమణ పొందే హెచ్ఎంలు, టీచర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. 50 ఏండ్లలోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేయాలని నిర్ణయించింది. బాలికల పాఠశాలలో మహిళలు ఎవరూ లేని సందర్భంలో 50 ఏండ్ల వయసు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతి కల్పించింది. పదోతరగతి సామర్థ్యం పాయింట్లు, సర్వీస్ పాయింట్లను ప్రభుత్వం తొలగించింది. స్పౌజ్, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి. ఎనిమిదేళ్ళలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపజేసింది. ఓడీ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు, గుర్తింపు పొందిన సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 అదనపు పాయింట్లు ఉంటాయి. ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయులకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయని వివరించింది.
కలెక్టర్ చైర్మెన్‌గా కమిటీ
మల్టీజోన్ స్థాయిలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) ద్వారా నామినేట్ చేయబడిన జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారి చైర్మెన్‌గా, ఆర్జేడీ సెక్రెటరీగా, సంబంధిత డీఈఓ సభ్యునిగా కౌన్సెలింగ్ కమిటీ ఉంటుందని మార్గదర్శకాల్లో విద్యాశాఖ ప్రతిపాదించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కలెక్టర్ చైర్మెన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మెన్‌గా, జెడ్పీ సీఈఓ సభ్యునిగా, డీఈఓ సెక్రెటరీగా కమిటీ ఉంటుందని తెలిపింది. జిల్లా స్థాయిలో జెడ్పీ, ఎంపీ టీచర్లకు జెడ్పీ చైర్పర్సన్ చైర్మెన్‌గా, కలెక్టర్ వైస్ చైర్మెన్‌గా, జాయింట్ కలెక్టర్, సీఈఓ సభ్యులుగా, డీఈఓ కార్యదర్శిగా కమిటీ ఉంటుందని వివరించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు డీఈఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొంది. బదిలీ ఉత్తర్వులు పొందిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులందరూ ఈ విద్యా సంవత్సరం (2022-23) చివరి పనిదినం (ఏప్రిల్ 24న) మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి బదిలీ అయిన పాఠశాలలో చేరతారని పొందు పరిచింది. అయితే ముసాయిదా మార్గదర్శకాల్లో మార్పులుండే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. అతి త్వరలోనే మార్గదర్శకా లతో కూడిన ఉత్తర్వులు వెలువరించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పరిశీలకుల నియామకం
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా చేపట్టేందుకు ప్రభుత్వం వివిధ జిల్లాలకు విద్యాశాఖ ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించింది. వికారాబాద్‌కు జి ఉషారాణి, జోగులాంబ గద్వాలకు ఎ ఉషారాణి, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలకు ఎస్ శ్రీనివాసాచారి, జగిత్యాలకు పి రాజీవ్, కరీంనగర్, మెదక్‌కు ఎ కృష్ణారావు, మహబూబాబాద్‌కు ఎన్ఎస్ఎస్ ప్రసాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లికి పి మదన్ మోహన్, భద్రాద్రి కొత్తగూడెంకు బి వెంకటనర్సమ్మను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జీరో సర్వీసు టీచర్లకు అవకాశమివ్వాలి : పీఆర్టీయూ తెలంగాణ
బదిలీలకు కనీసం రెండేండ్ల సర్వీసు కాకుండా జీరో సర్వీసు ఉన్న వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్ఎం గ్రేడ్-2 పదోన్నతులను ఆప్‌లైన్‌లో నిర్వహించాలని సూచించారు. వెబ్ఆప్షన్లలో నాట్ విల్లింగ్ ఆప్షన్‌ను కేటాయించాలని తెలిపారు. ఎస్జీటీలకు ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో అవకాశం ఉన్న వారికి అందరికీ న్యాయం చేయాలని పేర్కొన్నారు.
రెండేండ్ల సర్వీసు నిబంధనను సడలించాలి : యూఎస్పీసీ, టీఎస్‌యూటీఎఫ్
బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు రెండేండ్ల కనీస సర్వీసు నిబంధనను సడలించాలని ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను మంగళ వారం హైదరాబాద్‌లో యూఎస్పీసీ ప్రతినిధులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశమివ్వాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులను అన్ని ఖాళీలూ చూపకుండా పాఠశాలల అవసరం పేరుతో మారు మూల పాఠశాలలకు కేటాయించారని తెలిపారు. ఇతర జిల్లాలకు అర్ధాంతరంగా బదిలీ కావడంతో స్టేషన్ సర్వీసు పాయింట్లు కోల్పోయారని పేర్కొన్నా రు. వికలాంగులు కూడా అననుకూల పాఠశాలల్లో నియమించబడ్డారని వివరించారు. ఇప్పుడు అందరి కీ బదిలీ అవకాశం ఇవ్వకపోవటం అన్యాయమని ఆ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలి పారు. వెబ్ కౌన్సెలింగ్ కనుక జీరో సర్వీసుతో బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చినా ప్రభుత్వానికి ఆర్థికంగాగానీ, పరిపాలనా పరంగాగానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదబోదని సూచించారు.