Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 39 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాల బకాయిలు ఇవ్వాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల(పీఎంహెచ్)లో పనిచేస్తున్న వర్కర్లకు 39 నెలలుగా వేతనాలు బకాయిపడ్డాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయు) నేతలు టేకం ప్రభాకర్, బి. మధు, కె బ్రహ్మచారితో కలిసి ఆయన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ డైలీవేజ్ వర్కర్లకు ఎనిమిది నెలల వరకు వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా వేతన బకాయిలున్నాయని తెలిపారు. వారికి రావాల్సిన వేతనాలను తక్షణమే విడుదల చేయాలంటూ పలుమార్లు అధికారులకు విన్నవించామని గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే పీఎంహెచ్ఓలలో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం నుంచి విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. పెండింగ్ వేతనాల విడుదలతో పాటు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయాలనీ, గుర్తింపు కార్డులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తపాలా శాఖ ప్రవేశ పెట్టిన రూ.10లక్షల ఇన్సూరెన్స్ పాలసీని ఐటీడీఏ నుంచి ప్రీమియం చెల్లించి కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పేర్లను ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.