Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని అప్పులపాలు చేసింది మోడీ ప్రభుత్వమే..
- ఏం చేశారని పాలమూరు నుంచి పోటీ చేస్తారు?
- పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించారా? : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు మీరు ఏం ఒరగబెట్టారు.. కృష్ణా జలాల్లో ఈ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాలను తేల్చారా..? పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారా.. అసలు మీరు ఈ జిల్లాకు ఏమి చేశారని ఇక్కడి నుంచి ప్రధాని మోడీని పోటీ చేయించాలని చూస్తున్నారని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీని ప్రశ్నించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి ప్రసంగించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల కోసం పోట్లాడుతుంటే పరిస్థితులను చక్కదిద్దలేని ప్రధాన మంత్రి ఉక్రెయిన్-రష్యా యుద్దాన్ని నిలువరించేందుకు యత్నిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గతంలో ఈ దేశాన్ని 14 మంది ప్రధాన మంత్రులు పరిపాలించిన కాలంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే బీజేపీ ప్రభుత్వం రూ.100 కోట్ల లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు.
బీజేపీ నేతలకు దమ్ముంటే.. పాలమూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా తీసుకురావడంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించగలిగామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీ ఆర్థిక సలహాదారు విబేక్ దేబ్రారు ఒక జాతీయ పత్రికలో వ్యాసం రాశారన్నారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయిందని, వారిపై ఆదాయపు పన్ను వేయాలని ఆయన రాసుకొచ్చారన్నారు. ఆదాయమే లేదని ఏడుస్తుంటే.. రైతు మీద ఆదాయపు పన్ను వేయాలంటున్నరు.. దయచేసి రైతన్నలు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, తాను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక వేళ వాస్తవమైతే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకోవడంతోపాటు.. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సాగు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ విఎం.అబ్రహం, జడ్పీ చైర్‌పర్సన్స్ కె.వనజ ఆంజనేయులు గౌడ్, సరిత, పేట మున్సిపల్ చైర్పర్సన్ జి.అనసూయ, వైస్ చైర్మెన్ హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.