Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనుల అభివృద్ధి
- జీఓ నెం.3పై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేశాం
- మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, ఇంద్రవెల్లి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చి పోడుభూమి సాగుదారులకు హక్కుపత్రాలు ఇప్పిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో 9వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. జీఓ నెం.3ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని, మరోసారి సమీక్షించాలని కోరుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా మంగళవారం అధికారికంగా గిరిజన దర్బార్ నిర్వహించారు. అంతకుముందు మంత్రులు నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజనులు ఘనస్వాగతం పలికారు. దర్బార్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆదివాసీ, గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషిచేస్తుందని తెలిపారు. కానీ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ వచ్చిన తర్వాతే అన్ని రకాలుగా గిరిజనుల అభివృద్ధి జరుగుతోందన్నారు. రూ.321కోట్లతో గిరిజన ఆవాసాలకు కరెంటు సౌకర్యం వంటివి కల్పించినట్టు తెలిపారు. గిరి వికాసం కింద ఏటా రూ.100కోట్లు ఇస్తున్నామని, కరెంటు సౌకర్యం లేని చోట సాగునీటికి సోలార్ సిస్టమ్‌తో సరఫరా చేస్తున్నామన్నారు. రూ.40కోట్లతో జోడేఘాట్‌ను అభివృద్ధి చేశామని, కేస్లాపూర్లో నాగోబా ఆలయంలో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరో రూ.12కోట్ల ప్రతిపాదనలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడేలకు కనెక్టివిటి రోడ్ల కోసం 2022-23 బడ్జెట్లో రూ.340 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసి కేంద్రానికి పంపించినా అక్కడి నుంచి స్పందన లేదన్నారు. దేశంలో 12కోట్ల గిరిజనుల జనాభా కోసం కేంద్రం రూ.800కోట్లు కేటాయిస్తే.. రాష్ట్రంలో 40లక్షల మంది గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.50కోట్లు ఖర్చు పెడుతోందని చెప్పారు. దీన్నిబట్టి ఎవరు పేదల పక్షాన ఉన్నారో తెలుసుకోవాలన్నారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూములకు సంబంధించి కమిటీల పరిశీలన పూర్తయిందని త్వరలోనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేస్తామని చెప్పారు. కేస్లాపూర్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్‌ముండా, ఎంపీలు బండి సంజరు, సోయం బాపురావు ఆలయానికిగానీ, గిరిజనులకుగానీ ఒక్క రూపాయి అయినా ప్రకటించారా అని ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభ్వుత్వం అంకితభావంతో కృషిచేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు దండె విఠల్, రఘోత్తంరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్‌భాషాషేక్, నటరాజ్, జిల్లా ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేష్, ఆలయ చైర్మెన్ మేస్రం తుకారాం, సర్పంచ్ రేణుకా నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.