Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రూట్ల క్రమబద్దీకరణ, లాభాల గరిష్ఠీకరణపై డేటా విశ్లేషణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అవగాహనా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో మంగళవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐఎస్బీ డేటా సైన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్, టీఎస్ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ డేటా విశ్లేషణ వల్ల సంస్థ పనితీరు మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ విధానం ఇతర ప్రజా రవాణా సంస్థలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ 10 వేల బస్సులతో రోజుకు 35 లక్షల మంది ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నదని చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, మెరుగైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల అన్నారు. టీఎస్ఆర్టీసీ రవాణా వ్యవస్థని పటిష్ఠ పరచడానికి డేటా విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వీ రవిందర్, ఈడీ(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎస్‌వో విప్లవ్, కన్సల్టెంట్లు ముకుంద్, దీప, ఐఎస్బీ నుంచి మధు విశ్వనాథన్, సుధీర్ ఓలేటి, కుమార గురు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.