Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వామి అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో నిందితుడు బైరి నరేష్‌కు చర్లపల్లి జైల్లో కల్పించిన వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతడిని విడిగా సెల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయా?, ఇతర విచారణ ఖైదీలు ఉండే సెల్లో ఉంచేందుకు అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి చేసి నివేదిక ఇవ్వాలని జస్టిస్ విజరుసేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చర్లపల్లి జైలు గదిలో అతడిని ఏకాంతంగా నిర్బంధించడం చట్ట వ్యతిరేకమంటూ బైరి నరేష్, అతని భార్య సుజాత దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. రోజుకు ఒక గంట మాత్రమే సెల్ నుంచి నరేష్‌ను బయటకు పంపుతున్నారనీ, ఇతర ఖైదీలతో ఉంచకపోవడం, ఏకాంతంగా ఉంచడం అనేది హక్కుల ఉల్లంఘన అవుతాయంటూ పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు అయితే మత మనోభావాల్ని దెబ్బతీసేలా నరేష్ మాట్లాడారనీ, అందరితో కలిపి ఉంచితే అతని ప్రాణాలు ముప్పు ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం వాదించింది. నరేష్ మేలు కోసమే ఆ విధంగా విడిగా సెల్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పింది. వాదనల తర్వాత వాస్తవ నివేదిక నిమిత్తం పైవిధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.