Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెస్ చార్జీలు, స్కాలర్షిప్ పెంచాలి
- ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-మెహిదీపట్నం
బయట హోటల్లో ఒకపూట భోజనానికి రూ.60 ఉంటే.. హాస్టల్ విద్యార్థులకు రూ.10 ఎలా సరిపోతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ చార్జీలు, స్కాలర్షిప్ పెంచాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం నాయకులు అంజి, నీలా వెంకటేష్, గుజ్జ కృష్ణ నాయకత్వంలో విద్యార్థులు మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలుగు సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఐదేండ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్ షిప్‌నే ప్రభుత్వం నేటికీ కొనసాగిస్తున్నదన్నారు. దాంతో హాస్టల్, గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. ఆహారంలో గుడ్లు, పాలు, పండ్ల వంటి పౌష్టిక ఆహార పదార్థాలను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల, మంత్రుల, శాసనసభ్యుల వేతనాలు మూడు రేట్లు పెంచిన ప్రభుత్వం.. విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్ పెంచడానికి మాత్రం చేతులు రావడం లేదని విమర్శించారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తే ప్రభుత్వానికి రూ.150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల మెస్ చార్జీలను, స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, పీజీ తదితర కోర్సులు చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని కోరారు. లేనిచో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.