Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న కలెక్టరేట్ల ముందు ధర్నాలు
- ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య వెల్లడి
నవతెలంగాణ - వనపర్తి
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు 5శాతం నిధులు కేటాయించాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ప్రభుస్వామి అధ్యక్షతన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వనపర్తి జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లకు ఆదాయ పరిమితి విధించే జీవో 17ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరికరాలు, రుణాలు, పెండింగ్లో ఉన్న వివాహ ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో వికలాంగుల సంక్షేమం కోసం నిధులు కేటాయించ లేదన్నారు. ఆసరా పించన్ల మంజూరుకు ఆదాయ పరిమితి విధిస్తూ 2014లో జీవో నెంబర్ 17 విడుదల చేసిందన్నారు. దీంతో ఈ జీవోను 2022 అక్టోబర్ నుంచి అమలు చేయడం ద్వారా అర్హులైన అనేకమంది పించన్లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారి పించన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగ వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలకు ధ్రువీకరణ పత్రాలను తక్షణమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మధుబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.