Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్, అధికారుల కాళ్లపై పడ్డ మంచిప్ప నిర్వాసితులు
- పాత డిజైన్ ప్రకారమే పనులు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-మోపాల్
రీ డిజైన్ పేరుతో వేలాది ఎకరాలకు ముంపు వాటిల్లడంతో తమ బతుకులు ఆగమైతున్నాయని, తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని మంచిప్ప నిర్వాసితులు వాపోయారు. పనులు ఆపించాలని, పాత డిజైన్ ప్రకారం పనులు చేయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి, అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్‌పల్లిలో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కలెక్టర్ వాహనశ్రేణిని మంగళవారం భూ నిర్వాసితులు అడ్డుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాళేశ్వరం కొండెం చెరువు రిజర్వాయర్ ముంపు గ్రామ కమిటీ సభ్యులపై నమోదు చేసిన హత్యాయత్నం కేసులు వెంటనే ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరారు. తహసీల్దార్ శ్రీలత మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవద్దని సూచించారు. కలెక్టర్ తన వాహనం నుంచి దిగివచ్చి బాధితులతో మాట్లా డారు. 14 మందిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పం పించారని, 3.5 టీఎంసీల రిజర్వాయర్ పనులు వెంటనే నిలిపేయాలని బాధి తులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. తానూ రైతు బిడ్డనేనని రైతుల సాధక బాధకాలు తనకు తెలుసని కలెక్టర్ బాధితులను సముదాయించేందుకు ప్రయత్నించారు. నిర్వాసితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకుంటానని, తప్పు చేస్తే శిక్ష తప్పదని, లేకుంటే వదిలేస్తారని వివరించారు. పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడుతున్నారని, కొత్త డిజైన్‌పై నిర్వాహితుల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ముంపు బాధితులు మంచిప్ప గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గం తమ పదవులకు రాజీనామా చేయాలని, అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.