Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం రూ.7కోట్లతో తాత్కాలిక భవన నిర్మాణ పనులు
- త్వరలోనే శాశ్వత భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ
- పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీలో వచ్చే ఆగస్టు నుంచి ప్రవేశాలు ఉంటాయని, ప్రస్తుతం రూ.7కోట్లతో పాత భవనాన్ని మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలోనే శాశ్వత భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత భూమిపూజ చేయిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్ర సమీపంలో కొత్తపల్లి మండల కేంద్రంలోని విత్తన శుద్ధి క్షేత్రంలో మెడికల్‌కాలేజీ భవన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్లో రెండు ప్రయివేటు వైద్య కళాశాలలున్నా.. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో మెడికల్ కాలేజీని ఈ జిల్లాకు మంజూరు చేసిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పలు దశల్లో కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా వైద్య కళాశాల పనులు ప్రారంభించి ప్రవేశాల కోసం సిద్దం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు కొత్తపల్లిలోని విత్తన శుద్ది క్షేత్రంలోని గోదాం లో తాత్కాలిక భవన నిర్మాణానికి రూ.7కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. మొత్తం నాలుగు గోదాములతోపాటు 25 ఎకరాల స్థలాన్ని వైద్య కళాశాల కోసం కేటాయించినట్టు తెలిపారు. తరగతి గదులు, లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజియోలజీ ల్యాబ్, అడ్మిషన్ బ్లాక్ తాత్కాలిక భవన నిర్మాణ పనులు చేపట్టి వచ్చే ఆగస్టులో 100 మంది విద్యార్థులతో ప్రవేశాలు ప్రారంభించనున్నామని వివరించారు. శాశ్వత భవన నిర్మాణం ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, అది పూర్తవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భూమి పూజ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మెన్ రుద్రరాజు, జిల్లా కలెక్టర్ కర్ణన్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రెడ్డవేని మధు, అధికారులు పాల్గొన్నారు.