Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వరరావు
- నిమ్స్ ఆస్పత్రిలో నిరసన
నవతెలంగాణ- బంజారాహిల్స్
నిబంధనలు లేకుండా చలామణి అవుతున్న ఏజెన్సీలను కట్టడి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిమ్స్ ఆస్పత్రి సెక్యూరిటీ అధ్యక్షులు కె.ఈశ్వరరావు, సిటీ కార్యదర్శి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మహిళా సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ సెక్యూరిటీ గార్డ్స్ సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్మినెంట్ సెక్యూరిటీ రామారావు మహిళా సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్నారని చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గతంలో అతనిపై ఫిర్యాదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు జీవోలు 43, 60 ప్రకారం.. ప్రతి ఏడాదీ వేతనాలు పెంచాలని, ప్రస్తుతం వారికి రూ. 13 వేల నుంచి రూ.14 వేలు రావాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటికీ వారికి రూ.9 వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో నుంచే బట్టలు, షూస్ పేరుతో కోతలు విధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మెన్‌గా ఉన్న ఆస్పత్రిలోనే ఇటువంటి సమస్యలు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కార్మికులకు ప్రతి ఏటా 12 సెలవులతోపాటు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆర్గనైజింగ్ సెక్రటరీ శశికళ, నిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి,నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సీఐటీయూ ఉపాధ్యక్షులు జి.కిరణ్, ఏ ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.