Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెయిల్, డ్రాపౌట్ అయిన వారే టార్గెట్
- నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
నవతెలంగాణ-హయత్‌నగర్
చదువులో డ్రాపౌట్, ఫెయిలైన విద్యార్థులను టార్గెట్ చేసుకుని సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలకు పలు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. చింతల్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఆకుల రవి అవినాష్ అలియాస్ పరారీలో ఉన్నాడు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్‌సింగ్ చౌహన్ మీడియాకు వెల్లడించారు. నల్లగొండ జిల్లా రామన్నపేటలోని కొక్కిరేనికి చెందిన చింతకాయల వెంకటేశ్వర్లు శంషాబాద్‌లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ నిర్వాహించేవారు. దానితో నష్టం రావడంతో సులువుగా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ప్రధాన నిందితుడు అజరుతో పాటు కేతెపల్లికి చెందిన కొండ్రు నవీన్ కుమార్, రాజేంద్రనగర్‌కు చెందిన గండికోట జ్యోతి రెడ్డి, మేడ్చల్‌కు చెందిన గోపిణిగారి విశాల్, చైతన్యపురికి చెందిన పెద్దుకోట్ల అభిలాష్ కుమార్, శాలిగౌరారానికి చెందిన బిళ్లకంటి కళ్యాణ్, ఆసీఫ్‌నగర్‌కు చెందిన సోనుపారి విజరు కుమార్‌తో చేతులు కలిపాడు. కళాశాలలో చదివి డ్రాపౌట్, ఫెయిలైన వారిని టార్గెట్ చేసుకుని సర్టిఫికెట్లు ఇస్తామని నమ్మించేవారు. కొందరు ఏజెంట్లను పెట్టుకుని.. రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు నకిలీ సర్టిఫికెట్లు అందజేసేవారు. చైతన్యపురిలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి నకిలి సర్టిఫికెట్ గురించి సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం చేరవేశారు. దాంతో నిఘా పెట్టి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 86 నకిలీ సర్టిఫికెట్లు, 86 రబ్బరు స్టాంప్‌లు, 10 ఫోన్లు, 4ఎస్ఎస్సీ మెమోలు, 71 ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ శ్రీ బాల, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బినగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.