Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎస్వీ రమ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రమ మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలకు నెలకు కేవలం రూ.3,900 ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి ఆన్లైన్ పనుల పేరుతో పని భారం పెంచుతూ వీఓఏలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇచ్చే అతి తక్కువ వేతనాన్ని కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన దానికి కట్టుబడి వారికి వేత నాలు పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. లేకపోతే మహాధర్నా తప్పదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఓఏలు ఆ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజ్ కుమార్, నగేష్, కోశాధి కారి సుమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు రమేశ్, వెంకటయ్య, వసియా బేగం, సుమతి, శరత్ కుమార్, శ్రీనివాస్, తిమ్మప్ప, మస్తఫా, మల్లయ్య, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.