Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 6న చలో అసెంబ్లీ
- ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
- 31న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మిషన్ భగీరథ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని, వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడిగినా సమస్యలు పరిష్కరించనందున ఫిబ్రవరి 6న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్మికుల జేఏసీ ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యా లయంలో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంగూరి రాములు (సీఐటీయూ), ఎం.నరసింహ (ఏఐటీయూసీ), కె.సూర్యం (ఐఎఫ్టీయూ) మాట్లాడారు. మిషన్ భగీరథలో నిర్విరామంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డులు, పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి గతంలో అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని, మెగా ఎల్అండ్టీ లాంటి బడా సంస్థలు కార్మికులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే తప్ప వారి శ్రమకు తగిన ఫలితం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31న నిరసన, ఆందోళన కార్య క్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, కార్మికులు వేలాదిగా తరలివచ్చి ఫిబ్రవరి 6న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా కార్మికులను దోచుకుంటున్న సంస్థలకు కనువిప్పు కలిగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20వేల మంది కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం వీరిపై శ్రద్ధ చూపటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు సెలవులు, పండుగ, జాతీయ, ఆర్థిక సెలవులు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దెల రవి (బీఆర్ఎస్కేవీ), నాయకులు జె.బాబురావు, రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.