Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లుగా ఇక్కడే ఉన్నాం : బాధితులు
- గచ్చిబౌలిలోని ఇంద్రనగర్‌లో ఘటన
- ఫుట్ పాత్‌పై ఉన్నారనే తొలగించాం : జీహెచ్ఎంసీ అధికారులు
నవతెలంగాణ-మియాపూర్
పేదలు నివసించే గుడిసెలపై జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తెల్లవారుజామునే జేసీబీలతో పేదల గుడిసెలను నేలమట్టం చేశారు. బాధితులు లబోదిబోమని మొత్తుకున్నా కనికరించలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గుడిసెలను కూల్చివేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని ఇంద్రనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఆర్బీఆర్ కాంప్లెక్స్ పక్కన వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సుమారు 20 ఏండ్లుగా వారు ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో గుడిసెలను కూల్చి వేశారు. మహానగరంలో ఇంటి అద్దె కట్టుకోలేని స్థితిలో ఇలాంటి జీవనం కొనసాగిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఉన్న ఫళంగా ఖాళీ చేయమని అధికారులు చెప్పడం చాలా అన్యాయమన్నారు. తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉదయాన్నే తమ గుడిసెలపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఉన్నారని, ఒక్కసారిగా అధికారులు తమ గుడిసెలు తొలగించడం ద్వారా తాము ఎక్కడికి వెళ్లాలని మొర పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ఫుట్‌పాత్‌పై ఉన్నారని తొలగించాం : జీహెచ్ఎంసీ అధికారులు
ఫుట్‌పాత్‌పై ఉన్నారని అనేకసార్లు తమకు ఫిర్యాదులు అందడంతో గుడిసెలు తొలగించాం. అనేకసార్లు వీరికి నోటీసులు ఇచ్చాం. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో గుడిసెలు తొలగించాం.
ఒక్కసారిగా ఖాళీ చేయించడం అన్యాయం : కొంగర కృష్ణ, సీపీఐ(ఎం) మండల నాయకులు
గచ్చిబౌలిలో ఏండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయించడం అన్యాయం. వీరికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా గుడిసెలు కూల్చి వేయడం దారుణం. బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం.