Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత ప్రచారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉపాధ్యాయులు చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చి బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్ విడుదలవుతుందని టీఎస్‌యూటీఎఫ్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి అన్నారు. బయట ఉపాధ్యాయులు చేసే పోరాటాలకు మద్దతుగా శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలని చెప్పారు. మాణిక్‌రెడ్డి హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లి, ముషీరాబాద్ మండలాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి తోడు తననూ శాసనమండలికి పంపితే ఉపాధ్యాయులు పిలిస్తే పలికే వాడిగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. టీఎస్యూటీఎఫ్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్యమంలో భాగంగానే చూస్తామని, విద్యారంగానికి సంబంధించిన విస్తృతమైన చర్చలు జరిగి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, జిల్లా అధ్యక్షుడు రాజారావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సుందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శులు మధుసూదన్‌రావు, విశాలి, మండల నాయకులు సంజీవ, వంశీ, మాలతి, స్వరూప, సీనియర్ నాయకులు దేవదాసు, అప్పారావు, ఉమావాణి తదితరులు పాల్గొన్నారు.