Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయాల్లో మార్పులు అవసరం
- తెలంగాణలో మా పాత్ర.. కాలమే నిర్ణయిస్తుంది
- పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తాం
- ఆంధ్రా కంటే తెలంగాణలో పాలన భేష్
- ఏపీలో ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం : కొండగట్టులో జనసేన అధినేత పవన్కళ్యాణ్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాజకీయాల్లో మార్పులు అవసరం.. బీఆర్ఎస్ పార్టీ రాకను స్వాగితిస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో మా పార్టీ పాత్రను కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే ఇక్కడ 7 నుంచి 14 స్థానాల్లో.., పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. బలమైన నియోజకవర్గాల్లో నేనూ పర్యటిస్తాను' అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం తన ప్రచార రథం 'వారాహి'కి పూజలు చేశారు. అనంతరం ధర్మపురి లకిëనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కొండగట్టు సమీపంలోని బృందావన్గార్డెన్లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ పోరాటాల గడ్డ అని, తాను ఒక ఆశయం కోసం పోరాడుతున్నానని, అందుకు ఇక్కడి ఉద్యమాలే స్ఫూర్తినిచ్చాయని పవన్ అన్నారు. తెలంగాణలో జనసేన పాత్రపై ప్రశ్నించగా.. ఇక్కడ పోటీ ఖాయమనే సంకేతాన్ని స్పష్టం చేశారు. 7 నుంచి 14 స్థానాల్లో... పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీతో జనసేనకు పొత్తు ఉండదని, కానీ తన మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఎవరైనా తమతో పొత్తుకు వస్తే సంతోషమని, సొంతంగా గెలిచేస్థాయి లేనప్పుడు పోటీ చేయొద్దని భావిస్తానని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ మా పార్టీ అభ్యర్థులు నిలబడే ఒకట్రెండు బలమైన స్థానాల్లో తాను ప్రచారానికి వస్తానని తెలిపారు. కనీసం పట్టుమని పది మందిమైనా తెలంగాణ అసెంబ్లీలో జనసేన తరఫున ఉండాలి అని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పాలన బాగుందన్నారు. ఆంధ్రా, తెలంగాణ సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చలేమని చెప్పారు.
ఏపీలో పొత్తులపై ఎన్నికలప్పుడే స్పష్టత వస్తుందన్నారు. కొత్తగా పొత్తులు కోరి వచ్చే వారితో కలిసి వెళ్తామని, పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అక్కడి ఎన్నికల్లో తమ పార్టీ పాత్రను, ఇతర పార్టీలతో పొత్తులను 2024 ఏడాది నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరుతారా? అన్న ప్రశ్నకు.. తమ మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న ఆయన గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించబోనని దాటవేశారు.
రోడ్డుపై ఆగిపోయిన పవన్ వాహనం
కొండగట్టులో 'వారాహి' వాహనానికి పూజ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో పవన్ వాహనం నాచుపల్లి క్రాస్ రోడ్డు వద్ద పంక్చర్ అవ్వడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు పవన్ కారులోనే వేచి ఉన్నారు. భద్రత, పోలీసుబలగాలు అప్రమత్తమై కారుకి రక్షణ కల్పించారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే సిబ్బంది టైర్ మార్చడంతో బయల్దేరారు.
పవన్ టూర్లో కార్యకర్తల అసహనం
పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాక సందర్భంగా స్థానిక బృందావన్ రిసార్ట్లో సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అయితే, కొందరికి మాత్రమే ఎంట్రీ పాస్లు ఇచ్చారు. మీడియా ప్రతినిధులకూ పాస్లు ఇవ్వలేదు. దీంతో పోలీసులు పాస్లు ఉన్న వారినీ, మీడియాను సమావేశానికి హాజరు కానివ్వలేదు. ఇదే సమయంలో ఎంట్రీపాస్లు ఉన్న తమను ఎందుకు అనుమతించడంలేదని కొందరు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరికి పవన్ అక్కడికి చేరుకోవడంతో కొందరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపైనా, కార్యక్రమ నిర్వహణపైనా కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.