Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41,369 బడుల్లో 62.28 లక్షల విద్యార్థులు చేరిక
- రాష్ట్ర ఆర్థగణాంక శాఖ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 41,369 బడుల్లో 62,28,665 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,711, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,688, ఉన్నత పాఠశాలలు 12,045, మాధ్యమిక పాఠశాలలు 924 ఉన్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా 2,929 స్కూళ్లు, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 542 పాఠశాలలున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ నివేదికను బుధవారం విడుదల చేసింది. అందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మేడ్చల్-మల్కాజిగిరి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనే డ్రాపౌట్లు రికార్డు స్థాయిలో ఉన్నారని ప్రకటించింది. ఉన్నత పాఠశాలల్లో మేడ్చల్ మల్కాజిగిరిలో 26.71 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 26.08 శాతం, జోగులాంబ గద్వాలలో 23.37 శాతం డ్రాపౌట్లున్నారని వివరించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి హైదరాబాద్లో ఎక్కువ డ్రాపౌట్లున్నారని తెలిపింది. ప్రాథమిక స్థాయిలో 7.37 శాతం, ప్రాథమికోన్నత స్థాయిలో 7.78 శాతం డ్రాపౌట్లున్నారని పేర్కొంది.
రాజన్న సిరిసిల్లలో ప్రాథమిక పాఠశాలల్లో రికార్డు స్థాయిలో నెగెటివ్ డ్రాపౌట్ (-7.43 శాతం) నమోదైంది. పెద్దపల్లిలో ప్రాథమికోన్నత స్కూళ్లలో నెగెటివ్ డ్రాపౌట్ (-0.69 శాతం), కరీంనగర్లో ఉన్నత పాఠశాలల్లో (-1.46 శాతం) నమోదైందని వివరించింది. ప్రాథమిక పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో -0.54 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3.14 శాతం, ఉన్నత పాఠశాలల్లో 13.74 శాతం డ్రాపౌట్లున్నారు.