Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలి
- కరోనా సాకు చూపెట్టడం దారుణం : ఎంపీ లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామనీ, ఇది కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టులాంటిదని బీజేపీ ఓబీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, ఇతర పార్టీల సభలకు లేని కోవిడ్ నిబంధనలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎందుకని ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ వేడుకకి తుచ్ఛ రాజకీయాలను ఆపాదించడం దారుణమని పేర్కొన్నారు. బాబాసాహెచ్ అంబేద్కర్‌కు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారనీ, అసలు క్యాబినెట్ ఎప్పుడు జరిగింది? నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు? అని ప్రశ్నించారు. మహిళా గవర్నర్ అని చూడకుండా మినిమం ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం దారుణమన్నారు. తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా ఒకసారి మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా పర్యటిస్తారని తెలిపారు. 11వేల గ్రామాల్లో సమావేశాలు పెట్టి కేసీఆర్ మోసాలను ఎండగడుతామన్నారు. పల్లెగోస-బీజేపీ భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. శుక్రవారం జరిగే పరీక్షా పే చర్చ తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు పాఠశాలల్లో మోడీ ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పరేడ్ గ్రౌండ్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించాలి: బండి
పరేడ్ గ్రౌండ్‌లోనే అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలనీ, రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని కోరారు.