Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ లైసెన్సుల పేరుతో వేధింపులు సరికాదు
- సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపటం, పోలీసు లైసెన్స్ పేరుతో వ్యాపారులను వేధించడం సరికాదని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఆయా నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. కేసీఆర్ తొమ్మిదేండ్ల అసమర్థ పాలనలో, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యమనీ, ఆయన కుటుంబ అవినీతి, కమిషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాళా తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. గతంలో అభివృద్ధి ఛార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారని గుర్తుచేశారు. మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లుల డిపాజిట్ పేరుతో పేదల జేబుకు చిల్లుపెట్టడానికి రంగం సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు కరోనా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల పెరుగుదలకు తోడు ఉపాధి కరువై, ఉద్యోగాలు కోల్పోయి యువత రోడ్డున పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్య తరగతి వారిపై దోపిడీకి తెగబడటం క్షమించరాని విషయమని పేర్కొన్నారు.
విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకెళ్లాయి?
దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రగతి సాధించామన్నది నిజమైతే... విద్యుత్ సంస్థలు రూ.60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకెళ్లాయి? అని రేవంత్ఈ సందర్భంగా సీఎంను ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే రూ.20 వేల కోట్ల మేర బాకాయి పడిందని తెలిపారు. చత్తీస్ఘడ్తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టంగా ఉండి ప్రజలపై భారాలకు కారణమవుతున్నదంటూ నిపుణులు హెచ్చరించినా పెడ చెవిన పెట్టారని విమర్శించారు. యాదాద్రి-భద్రాద్రి లాంటి ప్లాంట్ల నిర్మాణంలో వినియోగిస్తున్న కాలం చెల్లిన సాంకేతికతతోనూ భారం తప్ప ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.