Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడబ్ల్యూసీ అంగీకారం
- ఢిల్లీ ఉన్నతస్థాయి భేటిలో నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం కొన్నేండ్లుగా అడుగుతున్న పోలవరం ఫుల్ రివర్ లెవెల్(ఎఫ్ఆర్ఎల్) ముంపు ప్రాంతాల సంయుక్త సర్వేకు కేంద్రం జల సంఘం అంగీకరించింది. ఇంతకు ముందు సమావేశాల్లో భద్రాచలంలోని ఏనిమిది అవుట్ ఫాల్ తూముల విషయంలో కూడా తెలంగాణ చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త సర్వే నిర్వహణకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర జల సంఘం చైర్మెన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలపై అంతర్రాష్ట్ర సమావేశం కేంద్ర జల సంఘం కార్యాలయంలో జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్ , తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, చీఫ్ ఇంజినీర్ కొత్తగూడెం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్ స్టేట్ గోదావరి డైరెక్టర్ సుబ్రమణ్యప్రసాద్ , ఒడిశా రాష్ట్రం నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ అశుతోష్‌దాస్ పాల్గొన్నారు. అలాగే కేంద్ర జల సంఘం, పోలవరం అథారిటీ అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అసలు ముంపు ప్రాంతాలు లేవంటూ, ఉంటే అందుకు తగిన ఆధారాలు చూపించాలని గతంలో అటు ఏపీ డిమాండ్ చేయగా, ఇటు సీడబ్ల్యూసీ సైతం చెప్పింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను కేంద్ర జలసంఘం చైర్మెన్‌కు సమర్పించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లోని ఆరు గ్రామాల్లో 899 ఎకరాల భూమి ముంపు పరిధిలోకి వస్తుందని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో మార్క్ చేసి చూపించడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సహకరించాలని కోరారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల మేరకు గతంలో పోలవరం ప్రాజెక్ట్‌లో ఎఫ్ఆర్ఎల్ వద్ద నీరు నిల్వ ఉన్నప్పుడు ముర్రేడు, కిన్నెరసాని వాగుల నీటి ప్రవాహాలపై ఉండే ప్రభావాలను అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది. ఆ మేరకు ఈ రెండు వాగులపై జాయింట్ సర్వే జరిపి ముంపు ప్రభావం ఉందని గుర్తించడం జరిగింది. ఆ ప్రభావిత ప్రాంతాలను డిమార్కేట్ తక్షణమే చేయాలనీ, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సూచించారు. అదనంగా మొదటి దశలో మరో ఆరు పెద్దవాగులపై ఇలాంటి ప్రక్రియ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కు సూచించడం జరిగింది. ఈ సర్వేలన్ని పీపీఏ ఆధ్వర్యంలో జరగాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. మణుగూరు భార జల ప్లాంట్, భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లో కూడా సర్వే చేసి ముంపు ప్రమాదానికి గురి అయ్యే ప్రాంతాలను గుర్తించాలని సీబ్లూసీ ఆంధ్రప్రదేశ్ కు సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం కాదనీ, కాగా పోలవరం ప్రాజెక్టు మూలానా ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టమని మాత్రమే కోరుతున్నదని ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్ర రావు అన్నారు.