Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర కోలాహలం
- జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ''యువగళం'' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్న 400 రోజులు, 4,000 కి.మీ.ల పాదయాత్రకు హైదరాబాద్ నుంచి బుధవారం బయలుదేరారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద, టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద, ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. కాగా నారా లోకేశ్ ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నేతత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. తప్పెట్ల మోతలు, టపాసులు, జానపద కోలాటాలతో సందడిగా బైక్ ర్యాలీ చేశారు. లోకేశ్ తన నివాసం వద్ద హాజరైన నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలతో సంఘీభావం ప్రకటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. టీడీపీ వర్థిల్లాలి, ఎన్టీఆర్ అమర్ రహే, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి, నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలి, యువగళం ప్రతిధ్వనించాలి, సైకో పోవాలి - సైకిల్ రావాలి తదితర నినాదాలతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాలు మార్మోగాయి.