Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేసిన ఐదు జీవోలను గెజిట్ చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవోలను సవరించాలనీ, గతేడాది విడుదల చేసిన ఐదు రంగాల కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పారిశ్రామిక కార్మికుల రాష్ట్రస్థాయి వర్క్‌షాపును సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ..1948 కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదేండ్లకోసారి వేతనాలు పెంచాలన్నారు. కానీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదున్నరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదని విమర్శించారు. దీంతో కార్మికులు వేల కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నష్టపోతున్న తీరును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు సవరించాలనీ, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం ఫిబ్రవరి నెలంతా కార్మికులు సర్వేలు చేయాలనీ, వాటి పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో క్లస్టర్ కమిటీ కన్వీనర్ భూపాల్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, పి.జయలక్ష్మి, టి.వీరారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, బి. మధు, పి. శ్రీకాంత్, కె. రమేష్, బి. మల్లేశం, కె. గోపాలస్వామి, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర నాయకులు చంద్రమోహన్, విష్ణు, జగదీష్, సాయిలు, ఆంజనేయులు, శ్రీను, నరసింహ, బ్రహ్మచారి, మీనా, కవిత, రాజు, అజరుబాబు పాల్గొన్నారు.