Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే హరితహారంలో స్థానిక జాతుల మొక్కలు నాటుతాం
- అర్బన్ పార్కుల నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి : పీసీసీఎఫ్ ఆర్ఎం. డోబ్రియాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవుల రక్షణ, వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. వేగంగా పెరిగే స్థానిక జాతుల మొక్కలను రాబోయే హరితహారంలో నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ పార్కుల నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నొక్కిచెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా, డివిజనల్ ఫారెస్టు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వేసవిలో అగ్ని ప్రమాదాల రూపంలో అడవులకు ముప్పు పొంచి ఉంటుందనీ, వాటి నివారణ కోసం బీట్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రమాదాలపై అటవీ సమీప గ్రామాల ప్రజల్లో, అడవుల గుండా వెళ్లే ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా వీలైనంత వరకు నివారించాలన్నారు. వేసవిలో వన్యప్రాణుల తాగునీటి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న వర్షాకాలంతో ప్రారంభించే హరితహారం సీజన్‌కు నర్సరీలను సిద్ధం చేయాలన్నారు. అర్బన్పార్కుల్లో ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డెన్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇండ్లలో పెంచుకునేందుకు వీలుగా పంపిణీకి కూడా మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హరితవనాల్లో వందశాతం పచ్చదనం పెంపుపై సమీక్షించారు. అడవుల్లో నీటి నిల్వల సామర్థ్యం, నేలల్లో తేమ పరిరక్షణ చర్యలు తీసుకోవటం వల్ల వాటి సహజ పునరుద్ధరణ వేగాన్ని పెంచొచ్చని సూచించారు. సమావేశంలో కంపా నిధులు, పనులు, పురోగతి, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం, గిరిజన గూడేలలో మౌలిక సదుపాయాల కల్పన, అటవీ నేరాల కేసుల సత్వర పరిష్కారం, తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ) ఎం.సీ.పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అధికారులు పాల్గొన్నారు.