Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి దారుణం
- 18 మంది ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం
- సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధనిక రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు అప్పులు చేయడమేంటో? వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడమేంటో అర్థం కావడం లేదని సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని లక్డికాపూల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరినీ సంప్రదించకుండా నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు. అఖిల పక్షం తరఫున ఎంతో మంది సీఎంల దగ్గరకు వెళ్లి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలనీ, ఈ సీఎం(కేసీఆర్) దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేకపోయానని చెప్పారు. ఆ చట్టంతో పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. సర్పంచుల సమస్యలపై సెమినార్లు, సదస్సులు మరిన్ని పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, వారందరి కుటుంబాలతో మీటింగ్ పెడితే బాగుంటుందని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమర్ధుడే అయినప్పటికీ అంతా కేసీఆర్ చేతుల్లో ఉండటంతో ఆయన ఏమీ చేయలేకపోతున్నాడన్నారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..సర్పంచ్‌లు ఏం చేయాలో ఎమ్మెల్యేలు నిర్ణయించడం దారుణమన్నారు. అసలు వారిపై ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నించారు. సర్పంచుల పదవీకాలం ఏడాదే ఉందనీ, పోరాడితే పోయేదేం లేదన్న భావనతో వారంతా రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని పార్టీలతో చర్చించి బలమైన పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వం చచ్చినట్టు దిగొస్తుందన్నారు. సర్పంచుల నిధులను కేసీఆర్ పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా సర్పంచులను వేధించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, వైస్ఆర్టీపీ నేత గట్టు రామచందర్‌రావు, ఆప్‌నేత సుధాకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు విమలక్క, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.