Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూములు పేదలకు పంచాల్సిందే.. : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటూ అనేక వాగ్దానాలు ఇచ్చిందని, అయినప్పటికీ నేటి వరకు వాటిని అమలుచేయకపోవడంతో విసిగివేసారిన పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాలీచాలని వేతనాలతో అద్దె భవనాల్లో నివసిస్తున్న 500 మందికి పైగా నిరుపేదలు.. సర్వే నెంబర్-283, 284, 285లో బుధవారం గుడిసెలు వేసి ఇంటి స్థలాల పోరాటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సింగరేణి అధికారులు.. అక్కడికి చేరుకొని నిలువరించే ప్రయత్నం చేయగా.. అక్కడే భీష్మించుకు కూర్చుని.. ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నిరుపేద కుటుంబాలు అద్దె భవనాలలో తీవ్ర ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబాలు.. ఇంటి స్థలాల పోరాటం ప్రారంభించారని తెలిపారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందన్నారు.
తమ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. దాంతో చేసేదేమీ లేక నిరుపేదలతో భూ పోరాటం ప్రారంభించినట్టు తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాల పోరాట బాధ్యులకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సహా ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కంపేటి రాజన్న, చెన్నూరి రమేష్, పొలం రాజేందర్, దామెర కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.