Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతీయ పతాకావిష్కరణలు
- ప్రజలకు తమిళిసై, కేసీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గణతంత్ర వేడుకల సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం తరపున వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ఉదయం ఏడు గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అనంతరం ఆమె పుదుచ్ఛేరికి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. ప్రగతి భవన్లో నిర్వహించే ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు ఆయన అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానానికి వెళ్లి అక్కడ అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం (తెలంగాణ భవన్-జూబ్లీహిల్స్)లో నిర్వహించే వేడుకల్లో ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు పాల్గొంటారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల్లో కూడా జాతీయ పతాకాలను ఎగురవేయనున్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం వర్ధిల్లాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.