Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థగణాంకశాఖ నివేదికలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న కార్యక్రమాలు, పథకాలను బలోపేతం చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ కార్యక్రమాలు, పథకాలు ఇస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వాటిని మెరుగుపరుస్తున్నది.
ఈ నేపథ్యంలో గతేడాది జిల్లాల వారీగా ఆయా కార్యక్రమాల అమలు, పథకాల నుంచి లబ్దిపొందిన వారికి సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో 19,79,139 మంది పిల్లలుండగా అందులో 1,20,447 మంది (6.09 శాతం) పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. 2021-22 లో 21,03,194 మంది చిన్నారులు అదనపు పౌష్టికాహారం కోసం నమోదు చేసుకోగా వారిలో 57.9 శాతం మంది అంటే 12,18,336 మందికి మాత్రమే పౌష్టికాహారం అందుతుండటం గమనార్హం. ఇందులోనూ 78.4 శాతంతో సిద్ధిపేట మొదటి స్థానంలో నిలవగా కేవలం 20.9 శాతం మందితో కామారెడ్డి చివరి స్థానంలోకి దిగజారింది. తల్లులకు అదనపు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి 4,82,242 మంది నమోదు చేసుకోగా 2,58,562 (53.6 శాతం) మందికి మాత్రమే అది అందుతున్నది. ఈ కేటగిరీలో 62.9 శాతంతో జగిత్యాల మొదటి స్థానంలో ఉండగా, 26.9 శాతంతో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. ప్రసవాల సమయంలో జరిగే మరణాలు 2019లో లక్షకు 56గా ఉండగా 2020 నాటికి 43కు తగ్గాయి. 2021-22 లో కేసీఆర్ కిట్లను 1,05,439 మందికి పంపిణీ చేయగా 2022-23లో ఆగస్టు నాటికే 97,448 మందికి అందజేశారు. 2021-22 లో 1,71,903 మంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ది పొందారు.
వెయ్యి మంది మగ పిల్లలకు...
934 మంది ఆడ పిల్లలు
నవజాత శిశువు మొదలుకుని ఆరేండ్ల లోపు చిన్నారుల సంఖ్య రాష్ట్రంలో 38,99,166గా ఉంది. వీరిలో మగ శిశువులు 20,17,935 కాగా వారి కన్నా 1,36,704 మంది తక్కువగా ఆడ శిశువుల సంఖ్య 18,81,231కే పరిమితమైంది. అంటే ప్రతి 1,000 మంది మగ శిశువులకు గానూ 934 మంది ఆడ శిశువులే ఉన్నారన్న మాట. జిల్లాలవారీగా చూస్తే ములుగు జిల్లాలో ప్రతి 1,000 మంది మగ శిశువులకుగాను 971 మందితో కొంత మెరుగ్గా ఉండగా, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల్లో ఆ సంఖ్య 903కే పరిమితమైంది.