Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు
- తొలుత లాంగ్వేజ్‌లు, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులకు వర్తింపు
- వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబు పత్రాల ఎవాల్యుయేషన్
- వచ్చే ఏడాది సైన్స్ సబ్జెక్టులకు అమలు
- టెండర్ నోటిఫికేషన్ విడుదల
- నేటినుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- సమర్పణకు తుది గడువు ఫిబ్రవరి 9
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభం కానుంది. తొలుత ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోని లాంగ్వేజ్‌తోపాటు ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులకు ఈ విధానాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సైన్స్ సబ్జెక్టులకు కూడా ఆన్లైన్ మూల్యాంకనం వర్తించనుంది. ఈ మేరకు బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గురువారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు తుది గడువు వచ్చేనెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అవకాశమున్నది. టెండర్ దరఖాస్తు ఫీజు రూ.మూడు వేలు చెల్లించాలి. వచ్చేనెల ఒకటో తేదీన ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) రూ.12 లక్షలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల తొమ్మిదిన మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను ఖరారు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దశలవారీగా వార్షిక, అడాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభమవుతుంది. వార్షిక పరీక్షలకు ఏటా పది లక్షల మంది, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఐదు లక్షల మంది జనరల్ విద్యార్థులతోపాటు వార్షిక పరీక్షలకు 70 వేల మంది, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి 40 వేల మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారు. ప్రస్తుత విద్యాసంవత్సరం వార్షిక పరీక్షల్లో తొలుత లాంగ్వేజ్ సబ్జెక్టులకు 20 లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులకు పది లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులకు ఐదు లక్షలు కలిపి మొత్తం 35 లక్షల జవాబు పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేస్తారు. సైన్స్ సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ (పాత పద్ధతిలో) మూల్యాంకనం జరుగుతుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో లాంగ్వేజ్ సబ్జెక్టులు ఏడు లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులు 3.50 లక్షలు, ఒకేషనల్ 1.50 లక్షలు కలిపి మొత్తం 12 లక్షల జవాబు పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేపడతారు. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) లో వార్షిక పరీక్షల్లో లాంగ్వేజ్ సబ్జెక్టులు 20 లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) పది లక్షలు, సైన్స్ సబ్జెక్టులు (50 శాతం మాత్రమే) పది లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులు ఐదు లక్షలు కలిపి మొత్తం 45 లక్షల జవాబు పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం జరుగుతుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో లాంగ్వేజ్ సబ్జెక్టులు ఏడు లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులు 3.50 లక్షలు, సైన్స్ సబ్జెక్టులు (50 శాతం మాత్రమే) నాలుగు లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులు 1.50 లక్షలు కలిపి 16 లక్షల జవాబు పత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకనం చేపడతారు. 2024-25 విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఇంటర్ పరీక్షలు-2025 వార్షిక పరీక్షల్లో లాంగ్వేజ్ సబ్జెక్టులు 20 లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) పది లక్షలు, సైన్స్ సబ్జెక్టులు 20 లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులు ఐదు లక్షలు కలిపి మొత్తం 55 లక్షల జవాబు పత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకనం కొనసాగుతుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో లాంగ్వేజ్ సబ్జెక్టులు ఏడు లక్షలు, ఆర్ట్స్, కామర్స్ (హ్యుమానిటీస్) సబ్జెక్టులు 3.50 లక్షలు, సైన్స్ సబ్జెక్టులు ఎనిమిది లక్షలు, ఒకేషనల్ సబ్జెక్టులు 1.50 లక్షలు కలిపి మొత్తం 20 లక్షల జవాబు పత్రాలకు ఈ పద్ధతే ఉంటుంది.