Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
- పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి
- మూసీని ప్రక్షాళన చేయాలి
- ప్రజాసమస్యలపై బీఆర్ఎస్తో రాజీపడబోం..: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-సూర్యాపేట
ఫిబ్రవరి ఒకటి నుంచి కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమంలో బడ్జెట్ కేటాయింపులు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంక్షేమ రంగానికి నిధులు పెంచాలని కోరారు. బడ్జెట్లో కేటాయింపులు పెరుగుతున్నాయి తప్ప ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లోనైనా గతేడాది ఖర్చు చేయని నిధులను కలిపి కొత్తగా కేటాయించాలని కోరారు. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మూసీని ప్రక్షాళన చేసి వెంటనే ఆధునీకరణ చేయాలన్నారు. మిర్యాలగూడెం నుంచి సూర్యాపేట మీదుగా ఖాజీపేట వరకు రైలుమార్గం ఏర్పాటు చేయాలని అనేక ఏండ్లుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రతిపాదనలు చేస్తున్నారు తప్ప సూర్యాపేటకు రైలుమార్గం ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రా నికి రైలు మార్గం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పారిశ్రామి కంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీని ఓడించడమే సీపీఐ(ఎం) రాజకీయ కర్తవ్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. బీఆర్ఎస్తో కలిసి పని చేసినంత మాత్రాన ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలయ్యే వరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, నాయకులు మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మీ, కోటగోపి, మేక అశోక్‌రెడ్డి, ఎల్గూరి గోవింద్, జె.నర్సింహారావు, మేకనబోయిన శేఖర్, మద్దెల జ్యోతి, మేకనబోయినసైదమ్మ, చిన్నపంగ నర్సయ్య పాల్గొన్నారు.