Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం మార్గదర్శకాల ప్రకారం పరేడ్‌ను కూడా ఏర్పాటు చేయాలి : హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గణతంత్ర వేడుకల్ని ఘనంగా, అధికారికంగా, వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదొక జాతీయ జెండా పండుగనీ, దేశభక్తిని చాటేదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా బహిరంగంగా కాకుండా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. గతంలో మాదిరిగానే నిర్వహించాలని ఆదేశించింది. పరేడ్ కూడా నిర్వహించాలంది. అయితే, ఎక్కడ నిర్వహించాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రజలను కూడా అనుమతించాలని సూచించింది. వేడుకలకు ఒక్కరోజే సమయం ఉన్నందున కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఏజీని ఆదేశించింది. కేంద్రం ఈ నెల 19న విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) గైడ్‌లైన్స్‌ను విధిగా అమలు చేయాలని సూచించింది. ఈ నెల 18న కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ఢిల్లీలో నిర్వహించే వేడుకలకు చెందినదని గుర్తు చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవీదేవి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేండ్ల మాదిరిగా (కరోనా సమయంలో) ఈసారి కూడా రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌డే నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నెల 19న ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.శ్రీనివాస్ వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను భోజన విరామ సమయం తర్వాత న్యాయమూర్తి విచారించి ఉత్తర్వులు జారీ చేశారు. రిపబ్లిక్ డే నిర్వహించేందుకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదనే విషయాన్ని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకిరణ్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 19న కేంద్రం (నెం22/2023) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రిపబ్లిక్‌డే నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. దేశంలో రిపబ్లిక్‌డే నిర్వహించకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ లేదన్నారు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందింప చేయడమే రిపబ్లిక్‌డే లక్ష్యమనీ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చడం అన్యాయమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రిపబ్లిక్ డే ను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం సమరయోధులు సాధించిన విజయాల్లో భాగమే రిపబ్లిక్ డే అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్ని గుర్తించి గవర్నర్ ద్వారా అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ వచ్చింద న్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏటా జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఎంతోమంది కుటుంబాలతో హాజరవుతారని, ఇదొక వేడుకగా చేస్తారనీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన ఏర్పాట్లు చేయకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడ మేనని అన్నారు. రిపబ్లిక్‌డే అంటే హాలిడే కాదనీ, ఇంట్లో కూర్చునే రోజు కాదనీ, జాతీయతను చాటి చెప్పే రోజంటూ సూర్య ముత్తు వర్సెస్ కేరళ కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మన పూర్వీకులు దేశం కోసం పాటుపడిన తీరుతెన్నులు, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కుల రక్షణకు రాసుకున్న గొప్ప రాజ్యాంగం గురించి నెమరవేసుకోవడం ద్వారా నేటి తరానికి ఆనాటి త్యాగాలను చాటి చెప్పడమే రిపబ్లిక్‌డే ఉద్దేశమని చెప్పారు. పెద్ద సంఖ్యలో స్కూల్ పిల్లలు హాజరయ్యేలా చేసి వారిలో జాతీయ స్ఫూర్తిని పెంపుదలకు కృషి జరిగేదన్నారు. రిపబ్లిక్‌డేకు హాజరయ్యే వారికి మంచినీళ్లు, ఆహారం వంటికి కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమా లను కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని వివరించారు. ఈ ఏర్పాట్లన్నీ చేసేలా కూడా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన రిపబ్లిక్‌డే వేడుకల్ని రాజ్‌భవన్‌లో నిర్వహించుకోవాలంటూ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం దారుణ మన్నారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఆ విధమైన సమాచారం ఇవ్వడం శోచనీయమన్నారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు చూసి పిటిషనర్ విస్తుపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరేడ్‌గ్రౌండ్‌లో రిహార్సల్స్ జరిగేవనీ, ఈ ఏడాది మాత్రమే జరగలేదన్నారు. దేశ స్వాతంత్య్ర/ గణతంత్ర వేడుకల్లో పిల్లలు పాల్గొనేలా చేయడం ద్వారా జాతీయత ఇనుమడింపజేయడమనే ప్రధాన ఆశయాన్ని నీరుగార్చేలా ప్రభుత్వ తీరు ఉందన్నారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు. తుది తీర్పు వెలువ రించేలోగా గురువారం రిపబ్లిక్‌డే నిర్వహించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లక్షల మందితో సభలు నిర్వహించేప్పుడు కరోనా అడ్డురాలే దన్నారు. రిపబ్లిక్‌డే జరిపేందుకు మాత్రం కరోనాను సాకు చూపడం అన్యాయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, కోవిడ్ కారణంగా ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తే అందుకు అనుగుణంగా చేసేందుకు సమయం సరిపోదన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహిం చేందుకు వీలుగా ప్రభుత్వం తెలియజేసిందని వివరించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున ఈ నెల 13న రాజ్‌భవన్‌కు లేఖ రాశామని.. రాజ్‌భవన్‌లోనే వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ విధానంలో జనం చూసేలా ఏర్పాట్లు కూడా చేశామన్నారు.